– వయోభారంతో ఆస్పత్రిలో తుదిశ్వాస
– నేడు అంత్యక్రియలు నవతెలంగాణ-
బంజారాహిల్స్/జూబ్లీహిల్స్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(90) కన్నుమూశారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తీసుకువచ్చారు. గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. నాదెండ్ల భాస్కరరావు మృతిపై పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటించారు.
నాదెండ్ల ప్రస్థానం
గుంటూరులో 1935 జూన్ 23న జన్మించిన నాదెండ్ల భాస్కరరావు హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కాలేజీలో బీఏ చదివారు. ఆపై న్యాయశాస్త్రం చదివారు. రాజకీయ రంగంలో విశేష సేవలందించారు. 1978లో విజయవాడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీ స్థాపనలో ఎన్టీఆర్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. 1983లో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఎన్టీఆర్ హయాంలో భాస్కరరావు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, ఎన్టీఆర్ అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో కాంగ్రెస్ మద్దతుతో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు 31 రోజులపాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర చరిత్రలో అత్యల్ప కాలం పదవిలో కొనసాగిన ముఖ్యమంత్రిగా ఆయన పేరు నిలిచింది. తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాక ఆయన ప్రజాస్వామిక తెలుగుదేశం పార్టీ పెట్టారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 1989లో తెనాలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 1998లో ఖమ్మం నుంచి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. 2019లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. నాదెండ్ల భాస్కరరావు వారసుడిగా కుమారుడు నాదెండ్ల మనోహర్ రాజకీయ రంగంలో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిసి అసెంబ్లీ స్పీకర్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు.
నాదేండ్ల భాస్కర్‌రావు మరణం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్‌రావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసన సభ్యులుగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘరాజకీయ జీవితంలో వారి అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ దుఖ:సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనో దైర్యంకల్పించాలని, బాస్కర్‌రావు ఆత్మకు శాంతి చేకూరాలని సానుభూతి తెలియజేశారు.
చిన్నారెడ్డి సంతాపం
మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్‌రావు మరణం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. బాస్కర్‌రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. భాస్కర్‌రావుతో ఉన్న అనుబంధాన్ని చిన్నారెడ్డి గుర్తు చేసుకున్నారు.



