Thursday, April 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి: సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక సంఘం ఎన్నికలు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల రెగ్యులరైజ్‌ తదితర 32 డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం వేసిన ఐఏఎస్‌ అధికారుల కమిటీ నాలుగు వారాల గడువు కోరడం సమ్మెను నీరుగార్చడమేనని విమర్శించారు. ‘ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఆర్టీసీకి ఇవ్వాల్సిన సుమారు రూ. 400 కోట్లతో పాటు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలి. సంస్థను ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించాలి. అద్దె బస్సుల ముసుగులో సంస్థను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రయివేటు వ్యక్తుల ద్వారా కొనుగోలు చేయిస్తున్నది. ఇది సరిగాదు. ప్రభుత్వమే నేరుగా ఎలక్ట్రిక్‌ బస్సులను కొనుగోలు చేసి, వాటిని సంపూర్ణంగా ఆర్టీసీ సంస్థకే అప్పగించాలి. ఏళ్ల తరబడి కనీస వేతనాలు, సౌకర్యాలు లేకుండా శ్రమ దోపిడీకి గురవుతున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను తక్షణమే రెగ్యులరైజ్‌ చేయాలి. ఖాళీగా ఉన్న డ్రైవర్‌, కండక్టర్‌ నియామకాలను వెంటనే చేపట్టి కార్మికులపై ఉన్న అదనపు పనిభారాన్ని తగ్గించాలి. గుర్తింపు సంఘం ఎన్నికలను జరపకపోవడం కార్మికుల గొంతు నొక్కడమే. ఇది కార్మిక వర్గం సాధించుకున్న చారిత్రక హక్కులపై దాడి. తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి’ అని పేర్కొన్నారు. ప్రయాణికులు, ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే సమ్మెను విరమింపజేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -