– నేటి నుంచి 25 వరకూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభ
– హాజరుకానున్న 600 మంది ప్రతినిధులు..
– 5000 మందితో ప్రారంభ సభ
నవతెలంగాణ – కొత్తగూడెం
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహా సభకు కొత్తగూడెం ఆతిథ్యం ఇస్తోంది. చారిత్రాత్మక సింగరేణి భూతలం కార్మిక వాడలో కర్షకులు కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు. రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఈ మహాసభ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. గురు, శుక్ర, శనివారాలు సాగే ఈ మహాసభ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. గురువారం ఉదయం 10 గంటలకు కొత్తగూడెం క్లబ్‌లో ప్రారంభ సభ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 600 మంది ప్రతినిధులు హాజరవుతుండగా.. 5000 మందితో ప్రారంభసభ జరగనుంది. మూడ్రోజుల పాటు జరిగే రాష్ట్ర మహాసభలో అఖిల భారత కిసాన్ సభకి అనుసంధానంగా తెలంగాణ రైతు సంఘం చేసిన ఉద్యమాలు, పోరాటాలపై చర్చిస్తారు. మహాసభ సందర్భంగా సెమినార్లు ఏర్పాటు చేశారు. ప్రతినిధులకు వసతి, భోజన సౌకర్యాలు పకడ్బందీగా కల్పిస్తున్నారు.
కాసాని ఐలయ్య నగర్‌లో..
మహాసభ నిర్వహించే ప్రాంతానికి.. రైతుసంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన కాసాని ఐలయ్య ప్రాంగణంగా, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి సామినేని రామారావు నగర్‌గా నామకరణం చేశారు. మహాసభకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా జలసూత్రం శివరాం ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. తొలి రోజు ప్రారంభ సభకు సభాధ్యక్షులుగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు వ్యవహరించనున్నారు. ప్రధాన వ్యక్తులుగా ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే, దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఎం.సాయిబాబు, బి.వెంకట్ హాజరవుతున్నారు.
పలు అంశాలపై సెమినార్లు
మహాసభలో భాగంగా పలు సెమినార్లు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించారు. ‘తెలంగాణ రాష్ట్రంలో పంటల ప్రణాళిక అమలు” అంశంపై వ్యవసాయ కళాశాల వైస్ చాన్స్‌లర్, ”భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం…”పై విజ్జూ కృష్ణన్ నేతత్వంలో సెమినార్ నిర్వహిస్తారు. మొత్తంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభ విజ్ఞానదాయక పోరాటాలకు వేదికగా కానున్నది. అనేక తీర్మానాల ఆమోదం, రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతంగం పట్ల అనుసరిస్తున్న విధానాలు, ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించేందుకు మహాసభ వేదిక కానుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేక పరిశ్రమలకు నిలయంగా, కార్మిక ఉద్యమ కేంద్రంగా ఉంది. పోరాటాల గడ్డపై మూడ్రోజుల పాటు జరిగే మహాసభకు జిల్లా రైతు సంఘం, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం, జిల్లా ట్రేడ్ యూనియన్, మహాసభ ఆహ్వాన సంఘం నాయకుల సమష్టి కృషితో పట్టణంలో ప్లెక్సీలు, తోరణాలు ఏర్పాటు చేశారు.
కార్మికవాడకు కర్షకులు ముస్తాబైన కొత్తగూడెం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



