నవతెలంగాణ-మిడ్జిల్
డ్రగ్స్ రైతు సమాజ నిర్మాణం కోసం విద్యార్థులు, యువకులు, మేధావులు కృషి చేయాలని ఎస్సై శ్రీనివాసులు చెప్పారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈగిల్ ఫోర్స్ , మిడ్జిల్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు యువకులు ఎంతోమంది నష్టపోయారని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి లేదా ఈగిల్ ఫోర్స్ వాట్సాప్ నెంబర్ 8712671111 కి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడుతాయని స్పష్టం చేశారు. చదువుతో పాటు మంచి నడవడిక అలవర్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



