– నాణ్యమైన వరి విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు: ఏఓ శ్రీనివాస్
నవతెలంగాణ – అశ్వారావుపేట
2026 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జూన్ 23 నుంచి జూన్ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల ద్వారా వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అశ్వారావుపేట మండలంలోని అశ్వారావుపేట, నారాయణపురం రైతు వేదికల లో విత్తన మేళా ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన, ధృవీకరించబడిన వరి విత్తనాలను సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉంచుతున్నట్లు ఏఓ శ్రీనివాస్ వెల్లడించారు.
పంపిణీకి బీపీటీ – 5204, ఆర్‌ఎన్‌ఆర్ – 15048, హెచ్‌ఎంటీ సోనా, కేఎన్‌ఎం-7715, డబ్ల్యూజీఎల్-44, జై శ్రీరామ్, కేఎన్‌ఎం -1638 తదితర వరి వంగడాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు తమ భూసార పరిస్థితులు, నీటి లభ్యత, సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనువైన వంగడాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ఖరీఫ్ సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు ధృవీకరించబడిన విత్తనాలను మాత్రమే వినియోగించాలని, విత్తన శుద్ధి చేపట్టి విత్తుకోవాలని, సమతుల్య ఎరువుల వినియోగంతో పాటు శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అవసరమైన విత్తనాలను తమ సమీప రైతు వేదికల నుంచి పొందాలని కోరారు.



