యూఎస్ డిఫెన్స్ కంపెనీలకు చేసే
ఎగుమతులపై ఆంక్షలు
అమెరికన్ రక్షణరంగ సంస్థల నుంచి
ఎటువంటి ఉత్పత్తులను కొనొద్దు
ప్రభుత్వ రంగ సంస్థలకు చైనా ఆదేశం
బీజింగ్ : అమెరికాకు చెందిన పది సైనిక సంబంధమైన కంపెనీలపై చైనా సోమవారం ఆంక్షలు విధించింది. రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోకుండా కొన్ని చైనా టెక్ కంపెనీలపై అమెరికా ఇటీవల విధించిన నిషేధానికి ప్రతిగా బీజింగ్ ఈ నిర్ణయం తీసుకుంది. చైనా నిషేధానికి గురైన కంపెనీలలో సైనిక డ్రోన్లను తయారు చేస్తున్న, అరుదైన ఖనిజాల తవ్వకంలో పాలుపంచుకుంటున్న సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలకు ‘ద్వంద్వ ప్రయోజన’ వస్తువులను ఎగుమతి చేయకుండా చైనా సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ద్వంద్వ ప్రయోజన వస్తువులు అంటే సైనిక, సైనికేతర అవసరాలకు రెండింటికీ ఉపయోగపడేవి. చైనా భద్రతను కాపాడడానికి ఈ ఆంక్షలు విధించామని వాణిజ్య శాఖ వివరించింది. ‘చైనా సైనిక కంపెనీలు’గా అమెరికా పిలుచుకునే సంస్థల జాబితాను ట్రంప్ ప్రభుత్వం విస్తరించిందని, దానికి ప్రతిస్పందనగానే ఎగుమతులపై నిషేధం విధించామని చెప్పింది. కాగా లాక్‌హీడ్ మార్టిన్, జనరల్ డైనమిక్స్ వంటి సంస్థలకు చెందిన విభాగాలు సహా మొత్తం 46 అమెరికా కంపెనీల ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా చైనా ప్రభుత్వ సంస్థలపై నిషేధం విధించామని ఆర్థిక శాఖ ప్రకటించింది.
చైనా సైన్యంతో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న సంస్థల జాబితాలో అలీబాబా, బైడు వంటి కంపెనీలను అమెరికా రక్షణ శాఖ ఈ నెల ప్రారంభంలో చేర్చింది. అయితే తమకు చైనా సేనలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణను బైడు తోసిపుచ్చింది. ఈ జాబితాలో చేరిన సంస్థలు అమెరికా సైనిక కాంట్రాక్టులు పొందలేవు. గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్‌లో పర్యటించినప్పుడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య కుదిరిన అవగాహనకు అమెరికా ఆంక్షలు వ్యతిరేకంగా ఉన్నాయని చైనా వాణిజ్య శాఖ విమర్శించింది.
తాజాగా చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించిన అమెరికా కంపెనీలలో కాలిఫోర్నియాలోని సిమి వ్యాలీలో ఉన్న ఏవీఈఓఎక్స్, ఉటాలోని దక్షిణ సాల్ట్ లేక్‌లో ఉన్న రెడ్ క్యాట్ హోల్డింగ్స్, టియల్ డ్రోన్స్, ఉటాలోని స్ప్రింగ్‌విల్లేలో ఉన్న ఐఎంఎస్‌ఏఆర్, రోడ్ ఐలాండ్‌లోని బ్రిస్టల్‌లో ఉన్న జయా రోబోటిక్స్, కొలరాడోలోని బ్రూమ్‌ఫీల్డ్‌లో ఉన్న బాల్ ఏరోస్పేస్ అండ్ టెక్నాలజీస్, విస్కాన్సిన్‌లోని ఓష్‌కోష్‌లో ఉన్న ఓష్‌కోష్ డిఫెన్స్, వర్జీనియాలోని నార్ఫోక్‌లో ఉన్న ఎల్3హర్రిస్ మారీటైమ్ సర్వీసెస్, లాస్ వెగాస్‌లో ఉన్న ఎంపీ మెటీరియల్స్, ఓక్లహోమాలోని స్టీల్‌వాటర్‌లో ఉన్న యూఎస్‌ఏ రేర్‌ఎర్త్ ఉన్నాయి.
అమెరికా-చైనా మధ్య టెక్ వార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


