పియ్రమైన వేణు గీతికకు
ఎలా ఉన్నావు నాన్నా… మీ కొలీగ్ పెళ్లికి వెళ్ళాను అని చెప్పావు, సంగీత్‌లో అందరూ పాల్గొన్నారని, బాగా ఎంజాయ్ చేసి వచ్చామని చెప్పావు. చాలా సంతోషం వేసింది. అయితే కిందటి వారం నేను పెద్దలు కుదిర్చిన పెళ్లి గురించి చెప్పాను. ఈ వారం ప్రేమ వివాహం గురించి చెప్తాను. చూడు అమ్మలు.. చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సహా విద్యార్థులు, సహా ఉద్యోగులతో పరిచయాలు, స్నేహం అనేవి ఉంటాయి. కొన్నాళ్ల స్నేహంలో ఇష్టాలు, అభిప్రాయాలు కలిసినప్పుడు ఒకరిపై ఒకరికి ప్రేమ అనేది ఏర్పడుతుంది. లేదా వీరు నా జీవిత భాగస్వామి అయితే బాగుంటుంది అనే భావన వస్తుంది. ఇది సహజం. అయితే పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా ఒకరి కుటుంబ విషయాలు ఒకరు తెలుసుకోవాలి. అలాగే కుటుంబం పట్ల వారికున్న బాధ్యతలు తెలియచేయాలి. దాపరికం లేకుండా తమ తమ కుటుంబ స్థితి గతుల గురించి తెలియచేయాలి.
వీటినన్నిటిని హృదయ పూర్వకంగా అంగీకరించి వివాహం చెసుకోవడానికి సిద్ధపడితే, పెద్దలకు తెలియ చేయాలి, ఒప్పుకోకపోతే ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. తల్లి తండ్రులు ఒప్పుకోకపోవడానికి అనేక కారణాలు, సందేహాలు ఉంటాయి. వాటికి తగిన సంతృప్తికర సమాధానాలు ఇచ్చి మెప్పించాలి. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. అవేమిటంటే.. కొత్తలో అంతా బాగానే ఉంటుంది. కొంత కాలం గడిచాక అవమానించేలా మాట్లాడటం, ఆకాంక్షలు విధించడం, ప్రతి విషయంలోనూ తప్పులు వెతకడం చేస్తుంటారు. ఎదుటివారి నిర్ణయాలను అగౌరవపరచిన, వారి ప్రతి కదలికలను తప్పు పట్టిన, అనుమానించి అవమానించిన ‘మారతారులే’ అని అనుకోకూడదు. ఎప్పుడు ‘నేను’ అనే పదం పదే పదే వినిపించిన జాగ్రత్త పడాలి. అప్పుడు గ్రహించవలసిన విషయం వారిలో స్థిరత్వం లేదని. చీటికీ మాటికి ఏవో సాకులు చెప్పి తప్పించుకుని తిరుగుతూ ఉంటే నేరుగా ఆడిగేయాలి.
సమాధానం చెప్పకుండా దాటవేస్తే వారిలో నిజాయితీ లేదని తెలుకోవాలి. నిజమైన ప్రేమలో ‘మనం ‘అనే పదం ఉండాలి. ప్రేమలో ముఖ్యంగా కావలసింది నమ్మకం. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలను గౌరవించడం. పరస్పరం అర్ధం చేసుకుని అరమరికలు లేకుండా, ఎలాంటి కష్టాలు వచ్చినా ఒకరికొకరు అండగా ఉంటేనే బంధం పటిష్టమవుతుంది. చిన్న చిన్న సంతోషాలే ప్రేమను పటిష్టం చేస్తాయి. బాధలో ఉన్నప్పుడు ఓదార్పు, కష్టాల్లో ఉన్నప్పుడు భరోసా ఈ బంధాన్ని పటిష్టం చేయడమే కాక కొత్త శక్తిని ఇస్తాయి. ప్రేమించడం తప్పుకాదు, ఆ ప్రేమను నిలబెట్టుకోవడం గొప్పవిషయం. అందుకు ఇద్దరూ సమానంగా కృషి చేయాలి. ఎవరినైనా ఇష్టపడితే ముందుగా ఇవన్నీ గమనించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి.
ప్రేమతో మీ అమ్మ
పాలపర్తి సంధ్యారాణి



