Wednesday, June 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆక్రమణదారు.. ఆగడాలు

ఆక్రమణదారు.. ఆగడాలు

- Advertisement -

ప్రభుత్వ స్థలంలో అక్రమ ప్రహరీ నిర్మాణమా?
ప్రశ్నించిన దళితులకు 
కోర్టు నోటీసులు
అధికారుల మౌనంపై గ్రామస్థులు ఆగ్రహం
సరిహద్దు వేసి, 
న్యాయం చేయాలని వేడుకోలు

నవతెలంగాణ -పెద్దవంగర
గూడు కోసం ఆశగా చూసుకున్న పేదల భూములపై ఓ పెత్తందారీ కన్ను పడింది. తనకున్న ఆర్థిక బలం, అంగ బలంతో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని, ప్రహరీ గోడను సైతం నిర్మించాడు. ప్రశ్నించిన దళితులపై అక్రమంగా కేసులు పెడుతూ.. వేధింపులకు గురి చేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ భూ కబ్జా పర్వంపై ఇటీవల తొర్రూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో బాధితులు ఆవేదన వెలిబుచ్చారు. ఆక్రమణదారు ఏడాది కాలంగా దళిత పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కబ్జా చేసి, ప్రహరీ గోడను నిర్మించడమే కాకుండా, ప్రశ్నించిన దళితులకు కోర్టు నోటీసులు పంపిస్తూ దౌర్జన్యం చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పెద్దమంగర మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. గ్రామంలోని సర్వే నెంబర్ 50/1లో 6.14 ఎకరాల భూమిని ఇంటి స్థలాల కోసం, సర్వే నెంబర్ 50/2లో 2.30 ఎకరాల భూమిని 50 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలంలోనే పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాలను కూడా నిర్మించారు.

ఈ 50 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లల్లో తాత్కాలికంగా నిరుపేద కుటుంబాలకు చెందిన బహుజనులు నివాసం ఉంటున్నారు. వీరు నివసిస్తున్న ఇంటి వెనక స్థలాన్ని సరిహద్దు పట్టాదారైన ఓ పెత్తందారీ.. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ గోడను నిర్మించాడు. ఈ ఆక్రమణపై ఏడాది కాలంగా దళితులు పోరాటం చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌ను కలిసి ఫిర్యాదు చేసినా, ప్రజావాణిని ఆశ్రయించిన కూడా అధికారులు స్పందించకపోవడంతో దళిత పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు చేతులెత్తేశారు. కూత వేటు దూరంలో ఉన్నా కనీసం తహసీల్దార్ అటువైపుగా కన్నెత్తి చూడలేదు. ఇది అదునుగా భావించిన ఆ కబ్జాదారు ఏకంగా పది మంది దళితులకు కోర్టు నోటీసులు పంపించాడు. ఆ నోటీసులతో అధికారులకు ఫిర్యాదు చేసినా.. సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదు.

సర్వేయర్ వేసిన సరిహద్దు ధ్వంసం చేసి మరీ..
ఈ విషయంలో గతంలో ఆ సరిహద్దు పట్టాదారు.. ఆర్‌ఐ సర్వేయర్‌ను ఆశ్రయించాడు. అందరి సమక్షంలో సర్వేయర్ వేసిన సరిహద్దులను సైతం ధ్వంసం చేశాడు. ప్రశ్నించిన దళితులపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీనిపై తహసీల్దార్ కార్యాలయంలో గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆక్రమణదారు పొలం కింద ఉన్న కాలువను సైతం వదలలేదు. కాలువ సగభాగాన్ని ఆక్రమించుకుని, కాలువ మధ్యలో ప్రహరీ గోడను నిర్మించాడు. దాంతో వరద నీరు ఎటూ వెళ్లకుండా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -