జుట్టుపోలుగాడు : (గట్టిగా ఏడుస్తూ) దేవుడా.. దేవుడా.. దొంగోడొచ్చి కత్తితో పొడిచి జేబు గుల్ల చేసినా బావుండు. దేవుడా.. దేవుడా… బందిపోట్లు గుర్రాలపై వచ్చి ఇల్లు లూటీ చేసినా బావుండు. దేవుడా.. దేవుడా…
కేతిగాడు : ఏమైందిరా.. ఆ ఏడుపులేంది? పెడబొబ్బలేంది?
జుట్టుపోలుగాడు : ఇంకేం కావాల్రా మావా… ‘నేను భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిని నిర్మలా సీతారామన్‌ను. దేశం కోసం మీరు వెంటనే 21 వేల రూపాయలు జమ చేయండి. నెలాఖరుకల్లా అది 40 వేలు అవుతుంది. ఆ తర్వాత తర్వాత మీ ఖాతాలోకి వద్దనకుండానే వేలు, లక్షలు జమ అవుతాయి. పేదవాళ్లను అనతికాలంలోనే లక్షాధికార్లుగా తయారు చేసే అద్భుత పథకం ఇది. జీరో రిస్క్. వందశాతం గ్యారంటీ’. అంటే ఆ డబ్బు కట్టాను మావా.. ఇప్పుడు ఆ డబ్బంతా గంగలో కలసిపోయింది మావా..
కేతిగాడు : ఎందుకలా..?
జుట్టుపోలుగాడు : అది అసలు కాదు, నకిలీ అని తేలిపోయింది మావా. ఇంకా అర్థం కాలా… అది డీప్ ఫేక్ వీడియో అంట మావా… చీర మీద చీర మార్చి, అందంగా మేకప్ వేసుకుని చక్కటి ఇంగ్లిష్‌లో మాట్లాడితే నిజమేని మోసపోయాను మావో… మావా…
కేతిగాడు : మోసమని ఎలా తెలిసిందిరా..?
జుట్టుపోలుగాడు : ఎహె, ఆమే స్వయంగా చెప్పిందిరా. అచ్చం తన ఆకారంతో తన గొంతుతో కృత్రిమ మేధస్సుతో అదే ఎఐ తో నకిలీ బొమ్మలు రూపొందించి, నెట్‌లో పెట్టి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసి డబ్బు దోచుకుంటున్నారని ఆమే స్వయంగా చెప్తే గాని నాకు తెలియలా… దేవుడా దేవుడా…
బంగారక్క (ప్రవేశం) : ఇక చాల్లే ఆపు. ఎదవేడుపు. ఆ షేర్స్, బెట్టింగ్ గేమ్స్ జోలికి పోవద్దని వాడికి నేను లక్షసార్లు చెప్పాను. విన్నాడా.. విన్లేదే. అనుభవించు. ఏది నకిలీనో, ఏది అసలో తెలుసుకునే లోపలే… మన భూములు, మన ఆస్తులు, మన డబ్బులు అన్నీ కైంకర్యం అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడి పాలకుల్లో చాలామంది ఇలాంటి మోసాలు చేసేటోళ్లు లేదా అలా మోసాలు చేసేటోళ్లకు అండగా నిల్చేటోళ్లు. మనమీద మనకు సోయి లేకపోతే ఎప్పటికైనా మిగిలేది ఇలాంటి ఏడుపులు, పెడబొబ్బలు. లేదా ఆత్మహత్యలు. మావా కేతిగా… మన కూలీలు పనికెళ్తే రోజుకెంతొస్తది?
కేతిగాడు : మహా వొస్తే ఐదారొందలు.
బంగారక్క : అది ఆదివాసీ ప్రాంతాల్లో ఇప్పటికీ రొండొందలే. ఉదయం 10 గంటలకెల్లి సాయంత్రం 5 గంటలకు ఎర్రటి ఎండలో పన్జేయాలి. గంట కాయకష్టానికి వంద రూపాయలు కూడా రానప్పుడు, ఏ పనీ చేయకుండా కూచుంటే చాలు… వేలూ లక్షలూ వచ్చి వొళ్లో పడ్తాయంటే అది దురాశ, మోసం, దోపిడీ కాదా. ప్రభుత్వం కూడా ఆ మోసాలను దోపిడీనే యధేశ్చగా బలపరుస్తుంది. ఇప్పుడు ఎ.ఐ. దానికి అగ్గికి ఆజ్యంలా తోడైంది. ఇదో రకం జూదం.
కేతిగాడు : అవునే బంగారక్క… నేనిప్పుడు సోషల్ మీడియా యాడ్ చూశాను. పాపం.. వలస కూలి. తను కట్టే భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. పనిపోయి కట్టుబట్టలతో ఇంటిదారి పట్టాడు. టిక్కెట్ లేకుండా రైలెక్కాడు. టి.సి. అతడి పరిస్థితిని గమనించి జాలిపడి ‘నేర్చుకో’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని షేర్ మార్కెట్‌లో దిగమని సలహా ఇస్తాడు. పైపెచ్చు ఈ షేర్స్ ఆట చదువుకున్నవాళ్లే కాదు, చదువులేనివాళ్లు కూడా ఆడి లాభం పొందవచ్చని సలహా ఇస్తాడు.
బంగారక్క : యాడ్స్ ఎప్పుడూ అందమైన మోసాలే మావా… బూస్ట్ తాగిన ప్రతివాడూ సచిన్ అయిపోతాడా.. ఇదీ అంతే. డబ్బే డబ్బును పెంచుతుంది అనేది పెట్టుబడి దారి సిద్దాంతం. అది లాభాన్ని, దోపిడీని, మోసాన్ని సమర్థిస్తుంది. కష్టానికి, కష్టజీవికి న్యాయం దక్కాలని కోరుకునేది సోషలిస్టు సిద్ధాంతం. అందుకోసం ప్రజలు చైతన్యవంతమై పోరాడమని హెచ్చరిస్తుంది. జుట్టుపోలుగానికి ఏ మాత్రం చదువుందని ఇలా గోతిలో పడ్డాడు. బాగా డబ్బున్నోళ్లు, చదువుకున్నోళ్లు కూడా ఈ గోతిలో పడుతున్నారు. తెలుసు కదా!
కేతిగాడు : అయితే ప్రభుత్వం మనలాంటి పేదోళ్లకు న్యాయం చేయదంటావా?
జుట్టుపోలుగాడు : లేదు… లేదు… ఎక్కడో ఎవరో చేసిన తప్పులకు మా మోడీ ప్రభుత్వాన్ని నిందిస్తే ఎలా..? ఎ.ఐ. ఎక్స్.పో సమ్మిట్‌కు మా ప్రధానే శ్రీకారం చుట్టారు తెలుసా… ఇరవై దేశాల నేతలు హాజరయ్యారు. ‘సర్వజన హితాయ సర్వజన సుభాయ’ దాని లక్ష్యం.
బంగారక్క : నిజమే. ప్రధాని మోడీ ప్రప్రధమంగా ఎన్నికైనప్పుడు పవిత్ర గంగామాత ప్రక్షాళనకు నడుం కట్టి శపథం చేశాడు. అలా ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు. పుష్కరకాలం అయింది. ఒక్కటైనా నెరవేరిందా..?
ఇద్దరూ : ఇంతకీ ఏమంటావ్?
బంగారక్క : దేనికైనా చిత్తశుద్ది వుండాలి. చిత్తశుద్ది లేని శివపూజలేలరా..? అని వేమన ఏనాడో చెప్పాడుగా.
- కె.శాంతారావు, 9959745723



