అడ్డుకోవాల్సిన బాధ్యత మనదే
మనది వందేండ్ల చరిత్ర
‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ స్లోగన్‌ను తిప్పికొట్టాలి
బీజేపీ వారసులే గాంధీని చంపారు
కష్టపడితే పదవులు వస్తాయ్.. పైరవీల చుట్టూ తిరిగితే గౌరవం పోతది
ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో సీఎం రేవంత్‌రెడ్డి
వికారాబాద్ అనంతగిరిలో పది రోజుల పాటు శిక్షణ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో రాజ్యాంగాన్ని సమూలంగా రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని, వందేండ్ల చరిత్రగల పార్టీగా దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దని, కానీ ఇప్పుడున్న పాలకులు ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ స్లోగన్‌ను తీసుకొచ్చి దేశానికి ఆత్మలాంటి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. దీన్ని పార్టీ నేతలు తిప్పికొట్టాలని తెలిపారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘సంఘటన సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల పది రోజుల శిక్షణా శిబిరం ప్రారంభమైంది.
ఆర్గనైజింగ్ సెక్రెటరీ వంశీ చందర్‌రెడ్డి, చైర్మెన్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహాలు, మీడియా నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశం కోసం మూడు తరాల గాంధీ కుటుంబం ప్రాణ త్యాగం చేసిందన్నారు. బ్రిటీష్ వాళ్లు కూడా గాంధీని కొట్టలేదని, కానీ దేశ భక్తులమని చెప్పుకునే బీజేపీ వారసులు గాంధీని చంపారని అన్నారు. దేశానికి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చి.. ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం ఇచ్చిందని తెలిపారు. దళిత, మైనార్టీ, అణగారిన వర్గాల తరపున మాట్లాడుతోందనే… కాంగ్రెస్‌ను లేకుండా చేయాలని కొన్ని పార్టీలు భావిస్తున్నాయని అన్నారు. శిక్షణను శిక్షగా భావిస్తే శూన్యమని, అవగాహన పెంచుకుంటే.. మేలు జరుగుతుందని సూచించారు.
పార్టీ, ప్రజల కోసం రాహుల్ గాంధీ.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి అందరూ కష్టపడాలని చెప్పారు. డీసీసీ పదవి అధికారం కాదని బాధ్యత అని తెలిపారు. తాను టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు పార్టీ పరిస్థితిని, తాను అనుసరించిన వ్యూహాలను వివరించారు. పార్టీలో అందరినీ కలుపుని కష్టపడితేనే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అలా కష్టపడిన వారికే ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మెన్ల పదవులు ఇచ్చామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లోనే పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయని అన్నారు. అయినా వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టి.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరికీ రాజకీయాల్లో ఓ లక్ష్యం ఉంటుందని, దానికి డీసీసీ పదవి తొలిమెట్టు అని అన్నారు. పైరవీల చుట్టూ తిరగొద్దని, అలా చేస్తే గౌరవం ఉండదని తెలిపారు.
కాంగ్రెస్‌కు నూతన దిశానిర్దేశం ‘సంఘటన సృజన్’ : టీపీసీసీ చీఫ్
‘సంఘటన సృజన్’ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి నూతన దిశానిర్దేశం చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్‌గౌడ్ తెలిపారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు పరస్పర అనుభవాలను పంచుకుంటూ బలమైన సంస్థాగత నిర్మాణం దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రెండు రాష్ట్రాల డీసీసీలు తదితరులు పాల్గొన్నారు.



