నాటు తుపాకుల కలకలం..
ఎస్పీ స్పందనతో వెలుగులోకి వేట ముఠా
నవతెలంగాణ – నసురుల్లాబాద్
జిల్లాలో అక్రమ కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా చేపడుతున్న ‘ఆపరేషన్ కవచ్’లో గాంధారి పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. అడవి జంతువుల అక్రమ వేటకు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసి, భారీగా నాటుతుపాకులు, పేలుడు పదార్థాలు, వేట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇటీవల “నాటు తుపాకుల కలకలం” అనే శీర్షికతో నవతెలంగాణ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా ఎస్పీ వెంటనే ప్రత్యేక దృష్టి సారించి, కేసు పురోగతిపై మీడియాకు వివరాలు వెల్లడించారు.
వాహన తనిఖీల్లో పట్టుబడ్డ ముఠా
జూన్ 24 రాత్రి గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండి సడక్ చౌరస్తా వద్ద గాంధారి ఎస్ఐ మహేందర్ సిబ్బందితో కలిసి ‘ఆపరేషన్ కవచ్’లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి వెనుదిరిగి పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నిర్వహించిన తనిఖీల్లో నాటుతుపాకులు, గన్‌పౌడర్, పొటాష్, స్టీల్ పెలెట్స్, ఫెల్ట్స్ వంటి వేట సామగ్రి లభించాయి. వారి సమాధానాలు పొంతన లేకపోవడంతో పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో సదాశివనగర్ సీఐ, గాంధారి, తాడ్వాయి ఎస్ఐలు, సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగించారు. విచారణలో నిందితులు అడవి జంతువుల వేట కోసం నాటుతుపాకులు కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. వర్షం కారణంగా వేటకు వెళ్లకుండా తిరిగి వస్తుండగా పోలీసులకు చిక్కినట్లు వెల్లడించారు.
సరఫరాదారు సహా 8 మంది అరెస్ట్
మూడు నెలల క్రితం ఆంగోత్ ధర్మ నాయక్, సలావత్ చందర్ మధ్యవర్తిత్వంలో బాన్సువాడ మండలం చిన్నరాంపూర్‌కు చెందిన అస్లాం చావుస్ వద్ద ఒక్కో నాటుతుపాకిని రూ.10 వేల చొప్పున కొనుగోలు చేసినట్లు నిందితులు తెలిపారు. ట్రిగ్గర్ మెకానిజంలు లేని మూడు తుపాకులను గండివేట్ తండా సమీపంలోని పొలంలో దాచినట్లు చెప్పడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సలావత్ చందర్, ఆంగోత్ ధర్మ నాయక్, ప్రధాన సరఫరాదారు అస్లాం చావుస్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మూడు చాప్స్ బ్యారెల్స్, ఒక ఎయిర్ గన్, మూడు ట్రిగ్గర్ మెకానిజంలు, స్టీల్ పెలెట్స్ స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సామగ్రి
నాటుతుపాకులు – 5
ఎయిర్ గన్ – 1
ట్రిగ్గర్ మెకానిజంలు – 3
చాప్స్ బ్యారెల్స్ – 3
స్టీల్ పెలెట్స్, గన్‌పౌడర్, పొటాష్, ఫెల్ట్స్
రెండు మోటార్ సైకిళ్లు
పోలీసు సిబ్బందికి నగదు బహుమతులు
కేసును సమర్థవంతంగా ఛేదించిన సదాశివనగర్ సీఐ బి. సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ మహేందర్, తాడ్వాయి ఎస్ఐ నరేష్, సిబ్బంది సంతోష్, పెంటయ్య, హోంగార్డ్ వీరప్రసాద్‌లను జిల్లా ఎస్పీ అభినందించి నగదు బహుమతులు అందజేశారు.
‘నేరస్థులకు సింహస్వప్నం పోలీస్ కవచ్’
ఈ సందర్భంగా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ ఆయుధాల సంస్కృతికి, వన్యప్రాణుల వేటకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదని హెచ్చరించారు. “నేరస్థులకు సింహస్వప్నం, ప్రజలకు రక్షణ భరోసా ‘ఆపరేషన్ కవచ్’. నిరంతర నిఘాతో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం. ప్రజల భద్రతే మా ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు.



