ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ
నవతెలంగాణ – పరకాల
హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలోని సర్వే నంబర్లు 371 మరియు 359కి చెందిన ప్రభుత్వ భూముల అక్రమ విక్రయాలపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పిఎస్) రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ స్పందించారు. ఈ భూముల వ్యవహారంపై ‘నవతెలంగాణ’ పత్రికలో వచ్చిన కథనంపై స్పందించి విచారణ చేపట్టిన రెవెన్యూ యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అధికారుల ప్రాథమిక విచారణలో సదరు సర్వే నంబర్లు పూర్తిగా ప్రభుత్వ భూములేనని నిర్ధారణ కావడంతో, తక్షణమే రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి భూమిని రెవెన్యూ శాఖ ఆధీనంలోకి తీసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలాగే, ప్రభుత్వ భూమిని సొంత ఆస్తిగా చూపించి ప్రజలను మోసం చేసిన వ్యక్తులపై మరియు అక్రమాలకు సహకరించి వసూళ్లకు పాల్పడిన ప్రజా ప్రతినిధిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మోసపోయిన అమాయక ప్రజలకు న్యాయం చేయాలని మరియు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు



