ఉమ్మడి జల వనరు వినియోగంలో
పరస్పరం చర్చ అవసరం
మూడు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపైకి
రావడం హర్షణీయం: కేంద్ర మంత్రి సీ ఆర్ పాటిల్
బెంగళూరు: కర్నా టక, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు ఒకే వేదికపైకి రావడాన్ని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ప్రశంసించారు. తుంగభద్ర కార్యక్రమంలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొనడం ఉమ్మడి నీటి వనరు ల విషయంలో సహకార స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. 73 ఏండ్ల క్రితం మట్టితో నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్ట్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో కేవలం ఒక్క గేటు కొట్టుకుపోవడం వల్ల అన్ని గేట్లూ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అయితే ప్రస్తుతం నిర్మిస్తున్న డ్యాంలు ఆధునిక సాంకేతికతతో రూపొందుతున్నాయని అభిప్రాయపడ్డారు. “మూడు రాష్ట్రాలు నిర్మాణాత్మక పద్ధతిలో కలిసి పనిచేశాయి, ఇది తుంగభద్ర వద్ద స్పిల్‌వే గేట్లను వేగంగా మార్చడంలో సహాయపడింది,” అని ఆయన అన్నారు. “ప్రతిపాదిత ప్రణాళికను తుంగభద్ర వద్ద విజయవంతంగా అమలు చేస్తే, జలాశయం యొక్క నీటి నిల్వ సామర్థ్యం 25 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. జలాశయాలలో పూడిక తీయడం అనేది నీటి లభ్యతను మెరుగుపరచడమే కాకుండా, పాతబడిన జలాశయాలపై ఆధారపడిన ఆయకట్టు ప్రాంతాలలో సాగునీటి భద్రతను బలోపేతం చేయడానికి కూడా ఒక ముఖ్యమైన చర్య,” అని ఆయన అన్నారు.
-నదుల అనుసంధానంతో శాశ్వత పరిష్కారం
నదుల అనుసంధానంతో దేశంలో నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర జల మంత్రి అన్నారు. నర్మద, సరోవర్ నదుల అనుసంధానం చేపట్టడంతో గుజరాత్‌కు ప్రస్త్తుతం నదీజలాలు సమృద్ధిగా అందుతున్నాయని గుర్తు చేశారు. రూ.లక్ష కోట్లతో రాజస్తా న్, మధ్యప్రదేశ్‌లో మూడు నదుల అనుసంధానం చేపట్టామని తెలిపారు.
పూడికలతీతకు ప్రణాళిక
దేశవ్యాప్తంగా ఉన్న జలాశయాల నుండి పూడికను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోందని కేంద్ర మంత్రి పాటిల్ తెలిపారు. అధికంగా పేరుకుపోయిన పూడిక కారణంగా తుంగభద్ర జలాశయంతో సహా అనేక ఆనకట్టల నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. పూడిక పేరుకుపోవడం వల్ల దేశంలోని అనేక ఆనకట్టలు తమ నిల్వ సామర్థ్యంలో 15 శాతం కంటే ఎక్కువ కోల్పోయాయని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ జలాశయాల కోసం ఒక ప్రత్యేక డ్రెడ్జింగ్ (పూడిక తీత) కార్యక్రమంపై పని చేస్తోంది. దీని కింద కేంద్రం సాంకేతిక మద్దతును అందిస్తుంది, అయితే అమలు బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది.



