Thursday, July 16, 2026
E-PAPER
Homeజాతీయంఎన్‌ఆర్‌ఐలకు సబ్సిడీ.. సామాన్యులకు భారం

ఎన్‌ఆర్‌ఐలకు సబ్సిడీ.. సామాన్యులకు భారం

- Advertisement -

ఆర్బీఐ స్వాప్ విధానంపై విమర్శలు
న్యూఢిల్లీ:
రిజర్వ్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయాలు సామాన్య బ్యాంక్‌ ‌ఖాతాదారులకు భారంగా.. ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ)లకు వరంగా మారాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచే లక్ష్యంతో ఆర్బీఐ అమలు చేస్తున్న ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) స్వాప్ విధానం.. పరోక్షంగా దేశీయ సామాన్య పౌరులపై భారాన్ని మోపుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. స్వాప్‌ ‌విధానంలో సాధారణంగా బ్యాంకులు ఎన్‌ఆర్‌ఐల నుండి డాలర్లు, పౌండ్లు లేదా యూరోలలో డిపాజిట్లు సేకరిస్తాయి. వీటిని మార్కెట్ రేట్ల ప్రకారం రక్షించుకోవడానికి ఏటా 3 నుంచి 4 శాతం ఖర్చు అవుతుంది. అయితే.. ఈ భారాన్ని బ్యాంకులు భరించకుండా ఆర్‌బిఐతో స్వాప్ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ ఒప్పందం ద్వారా బ్యాంకులు సేకరించిన విదేశీ కరెన్సీని ఆర్‌బిఐకి ఇచ్చి.. బదులుగా రూపాయలను పొందుతాయి. ఈ ప్రక్రియలో హెడ్జింగ్ ఖర్చును ఆర్‌బిఐ భరిస్తుంది. దీనివల్ల ఎన్‌ఆర్‌ఐలకు బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను 8 శాతం వరకు అందించగలుగుతున్నాయి.

సామాన్యులపై భారం ఎలా?..
ఆర్బీఐ వద్ద ఉండే విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేవి కేవలం అంకెలు కావు. ఇవి దేశం సాధించిన ఎగుమతులు, పన్నులు, సామాన్య భారతీయుల పొదుపుతో కూడినవి. విదేశీ పెట్టుబడిదారులకు అధిక రాబడులు అందించే క్రమంలో ఈ నిధులను సబ్సిడీ రూపంలో ఆర్‌బిఐ ఖర్చు చేయడం వల్ల స్వదేశంలో డిపాజిట్లు ఉంచే సాధారణ పౌరులు నష్టపోతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయంగా రూపాయి డిపాజిట్లపై 6 నుంచి 7 శాతం వడ్డీ లభిస్తున్నప్పటికీ.. ద్రవ్యోల్బణం, రూపాయి విలువ క్షీణత కారణంగా వాటి అసలు విలువ తగ్గిపోతోంది. కానీ.. ఎన్‌ఆర్‌ఐలు మాత్రం విదేశీ కరెన్సీలో వడ్డీని పొందడం వల్ల రూపాయి విలువ పడిపోయినా వారు సురక్షితంగా ఉంటున్నారు.

భారీ వ్యత్యాసం..
ప్రస్తుత జూన్ 2026 నాటికి ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) డిపాజిట్లపై భారతీయ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు అమెరికాలోని బ్యాంకుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు అమెరికాలో జెపి మోర్గాన్ వంటి బ్యాంకులు సుమారు 3.20 నుంచి 4 శాతం లోపు వడ్డీని ఇస్తుంటే భారత్‌లోని పలు బ్యాంకులు 7 శాతంపైగా వడ్డీకి ఇస్తున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లపై ఉన్న పరిమితిని తాత్కాలికంగా తొలగించడంతో కొన్ని బ్యాంకులు ఈ రేట్లను 8 శాతానికి పెంచే అవకాశం ఉంది.

ప్రశ్నార్థకం..!
రూపాయి విలువను స్థిరీకరించేందుకు విదేశీ నిధులను ఆకర్షించేందుకు ఈ విధానం ఉపయోగకరంగా కనిపిస్తున్నప్పటికీ ఇది దీర్ఘకాలంలో సబ్సిడీ భారాన్ని పెంచే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. స్వదేశీ పౌరుల త్యాగంతో విదేశాల్లో ఉన్న వారి సంపదను పెంచడం ఎంతవరకు సమంజసమన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. స్వల్పకాలిక ప్రయోజనం కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -