120 డాలర్ల నుంచి
72 డాలర్లకు
పడిపోయిన వైనం
పశ్చిమాసియాలో శాంతి నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడతాయా..!
115 రోజులకు పైగా కంటిమీద కునుకు లేకుండా చేసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసింది. ఇజ్రాయిల్ కు అండగా నిలిచి.. ఇరాన్‌ను ఆక్రమించుకోవాలన్న ట్రంప్ ఆశలు అడియాశలయ్యాయి. యుద్ధంలో చావుతప్పి కన్ను లొట్టపోయాక.. అమెరికా-ఇరాన్ తో శాంతి ఒప్పందం చేసుకున్నది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమం గా తగ్గుతూ వస్తున్నాయి. తాజా పతనంతో ముడి చమురు ధరలు నాలుగు నెలల్లోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ సమయంలో బ్యారెల్‌కు సుమారు 120 డాలర్లకు చేరి ప్రపంచాన్ని కంగారు పెట్టిన చమురు ధర ఇప్పుడు బ్యారెల్ ధర 72.28 డాలర్లకు పడిపోయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే దీని ధర 4శాతం మేర తగ్గడం గమనార్హం. ఇక, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడాయిల్ ధర 1.69శాతం తగ్గి బ్యారెల్‌కు 69.15 డాలర్లు పలికింది. ఇటీవలి కాలంలో దీని ధర 70 డాలర్ల దిగువకు చేరడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో హార్ము జ్ జలసంధి మీదుగా కనీసం 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అయినట్టు అమెరికా ఇంధన మంత్రిత్వశాఖ వెల్లడించింది. రాబోయే కొన్ని వారాల్లోనే ఈ జలమార్గంలో చమురు రవాణా యుద్ధం మునుపటి స్థాయికి పెరుగుతుందని అంచనా వేసింది. పశ్చిమాసియాలో యుద్ధం ముగియడంతో పాటు ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలను సడలించడం వంటి కారణాలతో క్రూడాయిల్ ధరలు దిగొస్తున్నాయి.
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 28న, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి దిగాయి. ఇరాన్‌పై తమ మొదటి దాడులను ప్రారంభించాయి. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హత్యచేశాయి. గంటల్లో ఇరాన్ తమ వశమవుతుందను కున్నాయి. కానీ .115 రోజులకుపైగా ట్రంప్, నెతన్యాహు దాడులు కొనసాగించగా ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. దీంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి బ్రిటన్, భారతదేశం వరకు పలు దేశాల్లో తీవ్రమైన చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. భారతదేశంలో అధిక ముడి చమురు ధరల కారణంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దాదాపు నాలుగేండ్లుగా… ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సి వచ్చింది. అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందంతో ఇప్పుడు ముడి చమురు ధరలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్న ఆశలు కూడా పెరుగుతున్నాయి.
120 డాలర్ల నుంచి 72 డాలర్లకు పడిపోయిన చమురు ధరలు
అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంతో ఇరాన్, ప్రపంచ చమురుస గ్యాస్ అవసరాలలో 20 శాతం సరఫరా చేసే కీలకమైన సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధిని మూసివేసిన విషయం విదితమే. దీంతో ఏప్రిల్‌లో ముడి చమురు ధర అకస్మాత్తుగా 120 డాలర్ల వద్దకు చేరడం ప్రారంభమైంది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఇంధనం , గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి, ద్రవ్యోల్బణానికి దారితీశాయి. దీని బారి నుంచి అమెరికా కూడా తప్పించుకోలేకపోయింది. ఇప్పుడు, అమెరికా , ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తరువాత, చమురు ధరలు అకస్మాత్తుగా తగ్గడం ప్రారంభించాయి . గత నాలుగు నెలల్లో ముడి చమురు ధరలకు ఇది అత్యల్ప స్థాయి కావటం విశేషం.
పెట్రోల్ , డీజిల్ ధరలు దిగొస్తాయా ?
గతంలో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటినప్పుడు, నష్టాల కారణంగా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచవలసి వచ్చింది. ఇప్పుడు చమురు ధరలు తగ్గడం వల్ల ఇంధన ధరలు కూడా తగ్గుతాయా? లేదా అనే చర్చ మొదలైంది. కోటక్ సెక్యూరిటీస్‌లో కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ అయిన కాయనత్ చైన్‌వాలా మాట్లాడుతూ, యూఎస్-ఇరాన్ ఒప్పందం ప్రపంచ ఉద్రిక్తతలను తగ్గించిందని, అలాగే 60 రోజుల పాటు ఇరాన్ చమురు, పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించడానికి యూఎస్ ట్రెజరీ అనుమతి ఇవ్వడం ప్రపంచ సరఫరా గొలుసు మెరుగుపడుతుందనే ఆశలను బలపరిచిందని అన్నారు. ట్యాంకర్ ట్రాకింగ్ డేటా ప్రకారం, గత వారం ఆసియాకు 3 కోట్ల బ్యారెళ్లకు పైగా ముడిచమురు రవాణా చేయబడింది. చైన్‌వాలా తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ ఆసియా కొనుగోలుదారులకు గణనీయమైన రాయితీలను అందిస్తుండగా, గల్ఫ్ ఉత్పత్తిదారులు తమ ప్రధాన ప్లాంట్లలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. హార్ముజ్ జలసంధి గుండా సాధారణ రవాణా కొనసాగితే, చమురు త్వరలోనే మార్కెట్లకు చేరుకుంటుంది. అయితే, డిమాండ్ మెరుగుపడ కపోతే, ఇంధన ధరలలో గణనీయమైన మార్పులు కనిపించే అవకాశం లేదు.
పెట్రోల్, డీజిల్ ధరలు అకస్మాత్తుగా పడిపోవు
మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన పరిశోధన ప్రకారం..చమురు ధరలు తగ్గడం వల్ల దేశ దిగు మతుల బిల్లు తగ్గుతుంది. రూపాయి బలపడుతుంది. ద్రవ్యోల్బ ణ ఒత్తిడి తగ్గుతుంది. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గుతాయని ఆశించే వినియోగదారులు వేచి చూడాల్సి రావచ్చు. అవి తక్షణమే తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే, భారతదేశంలో ఇంధన ధరలు కేవలం ముడి చమురు ధరల పైనే కాకుండా పన్నులు, రిఫైనింగ్ మార్జిన్లు, మార్కెటింగ్ ఖర్చులు వంటి అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉం టాయి. ఏదేమైనా, ముడి చమురు ధరలలో ఈ తగ్గుదల భారత దేశ దిగుమతుల బిల్లుకు కొంత ఉపశమనం కలిగించవచ్చు.
నాడు గల్ఫ్ యుద్ధం నుంచి ఇప్పుడు ఇరాన్ యుద్ధం వరకు..
యుద్ధాలు జరిగిన ప్రతిసారీ దేశ ప్రజల నడ్డి విరచటం సర్వ సాధారమైపోయింది. బ్యారెల్ ధరలు పెరిగాయి.. మా వల్ల కాదంటూ చమురు సంస్థలు రోజుల వ్యవధిలో భారాలు మోపుతాయి. ఎన్నికలు ఉన్నప్పుడయితే ఫలితాలు రాగానే బాదటం కామన్. ఇక చమురు ధరలు తగ్గితే మాత్రం అటు చమురు సంస్థలు కానీ, ఇటు కేంద్రం కానీ నోరు మెదపదు. సామాన్య, మధ్య తరగతి మాత్రం పెరగని ఆదాయాలతో అప్పో సోప్పో చేసి బతుకీడ్చటం సర్వసాధారణమైపోయింది.



