Friday, June 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌లో ప్రత్యామ్నాయ దారిని అనుమతించం

హార్ముజ్‌లో ప్రత్యామ్నాయ దారిని అనుమతించం

- Advertisement -

ఇరాన్‌ నిర్దేశించి మార్గంలోనే
ప్రయాణించాలి : ఐఆర్‌జీసీ నేవీ

టెహ్రాన్‌ : హార్ముజ్‌ జలసంధిలో అనుమతించిన మార్గాలలోనే ప్రయాణించాలని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ)కు చెందిన నౌకాదళం వాణిజ్య నౌకలకు సూచించింది. ఇరాన్‌ నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే దారిలో ప్రయాణిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ‘కొన్ని సంస్థలు ముందస్తు నోటిఫికేషన్‌ ఇవ్వకండా, ఇరాన్‌తో సమన్వయం చేసుకోకుండా హార్ముజ్‌లో వాణిజ్య నౌకల ప్రయాణానికి కొత్త రవాణా మార్గాన్ని ప్రకటించాయి. ఈ ప్రతిపాదిత మార్గం ఆమోదయోగ్యమైనది కాదు. అది తీవ్రమైన భద్రతా ప్రమాదాలకు కారణమవుతుంది’ అని తెలిపింది. ఇరాన్‌ అనుమతించిన మార్గాల మీదుగానే హార్ముజ్‌లో ప్రయాణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మార్గాల వెలుపల ప్రయాణించే నౌకలను నిషేధిస్తామని, వాటిని అత్యంత ప్రమాదకరమైనవిగా చూస్తామని చెప్పింది. నిర్దేశించిన కారిడార్ల వెలుపల ప్రయాణించవద్దని అన్ని నౌకలకు సలహా ఇచ్చింది.

హార్ముజ్‌లో ప్రయాణించే నౌకలు విధిగా ఇరాన్‌ అధికారులతో సంప్రదింపులు జరపాలని ఐఆర్‌జీసీ నేవీ తెలిపింది. హార్ముజ్‌ను దాటాలంటే ఛానల్‌ 16 ద్వారా తమతో సమన్వయం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. దీనిని ఉల్లంఘించే నౌకలన్నింటి పైన చర్యలు తప్పవని హెచ్చరించింది. హార్ముజ్‌పై నియంత్రణ విషయంలో ఒమన్‌ బుధవారం చేసిన ప్రకటనపై ఐఆర్‌జీసీ ఈ మేరకు ఘాటుగా స్పందించింది. అంతర్జాతీయ సముద్రయాన సంస్థతో సమన్వయం ద్వారా హార్ముజ్‌లో నౌకా రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేశామని ఒమన్‌ ఆ ప్రకటనలో తెలిపింది. ఎలాంటి రవాణా రుసుములు లేకుండా వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా హార్ముజ్‌లో ప్రయాణించడం కోసం దీనిని ఏర్పాటు చేశామని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -