Friday, June 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రాంతీయ భద్రతకు ముప్పే

ప్రాంతీయ భద్రతకు ముప్పే

- Advertisement -

అమెరికా-ఇరాన్‌ ఒప్పందంపై గల్ఫ్‌ ఆందోళన
వాషింగ్టన్‌ కల్పిస్తున్న రక్షణపై నీలినీడలు ఎంఓయూలో కీలక అంశాల ప్రస్తావన లేకపోవడంపై అసహనం

అబూధాబీ : అనేక దశాబ్దాల పాటు పర్షియన్‌ గల్ఫ్‌లోని దేశాల నేతలు అమెరికాతో తమ సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగానే చూశారు. ‘అమెరికా రక్షణ లేకుంటే మీరు రెండు వారాలు కూడా అక్కడ ఉండలేరు’ అని సౌదీ రాజును ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2018లో అన్నారు. అయితే రానురానూ ఆ ప్రాంతంలో పరిస్థితులు మారిపోతున్నాయి. అమెరికాతో సంబంధాలు తమ భద్రతకు మూల స్తంభమని గల్ఫ్‌ నేతలు భావించినప్పటికీ ఆయా దేశాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. 2019లో సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలపై అతి పెద్ద దాడి జరిగింది. దీంతో అక్కడ ముడి చమురు ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది. అంతర్జాతీయ చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ దాడికి ఇరానే కారణమని అమెరికా నిందించినప్పటికీ టెహ్రాన్‌ను వాషింగ్టన్‌ ఎంత వరకూ నిలువరించి తమను కాపాడుతుందనే ప్రశ్నలు గల్ఫ్‌ నేతలను కలవరపరుస్తున్నాయి.

పెనం మీద నుంచి పొయ్యిలో పడతామా?
ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత గల్ఫ్‌ దేశాలకు వాస్తవం అర్థమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతున్న గల్ఫ్‌ దేశాల రక్షణ బాధ్యత తనదేనని ట్రంప్‌ బీరాలు పలికారు. ప్రాంతీయ ఘర్షణలను నివారించడానికి గల్ఫ్‌ దేశాలు ప్రయత్నించినప్పటికీ అమె రికా- ఇజ్రాయిల్‌ సేనలు ఇరాన్‌పై కయ్యానికి దిగాయి. ఈ పోరు గల్ఫ్‌లో ప్రతీకార దాడులకు కారణమైంది. ఇదేనా అమెరికా రక్షణ అంటూ గల్ఫ్‌ దేశాల ప్రజలు, పాలకులు ప్రశ్నించు కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో గల్ఫ్‌ దేశాలలో పర్యటిస్తూ వాటికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అమెరికా తమ భద్రతకు కట్టుబడి ఉంటుందా ఉండదా అనేది ఆ దేశాలకు ఇప్పుడు ప్రశ్న కాదు. ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం తమ పరిస్థితిని మెరుగుపరుస్తుందా లేక మరింత దిగజారుస్తుందా అన్నదే వాటిని వేధిస్తున్న ప్రశ్న. పెనం మీద నుంచి పొయ్యిలో పడతామేమోనన్నది వారి అనుమానం.

రుబియో భరోసా ఇస్తున్నా…
అరబ్‌ గల్ఫ్‌ దేశాల దృష్టిలో ఇరాన్‌ యుద్ధం ప్రాంతీయ భద్రతా వ్యవస్థకు ఓ వినాశకర మలుపు అని విశ్లేషకులు తెలిపారు. గల్ఫ్‌ నుంచి అమెరికా వైదొలగడం, ఇరాన్‌కు ఆర్థిక వనరులు అందించడం వంటి పరిణామాలు టెహ్రాన్‌కు ఊతమి స్తాయని వారు చెప్పారు. ఇరాన్‌ దాడులను పెద్ద ఎత్తున ఎదుర్కొన్న యూఏఈ, కువైట్‌లో రుబియో పర్యటన కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన సయోధ్యపై ఈ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కువైట్‌లో రుబియో మాట్లాడుతూ ఇరాన్‌తో తాము కుదుర్చుకున్న ఒప్పందం గల్ఫ్‌ మిత్ర దేశాలను బలహీనపరచబోదని, తమ భద్రతా హామీల విషయంలో వారికి ఎలాంటి సందేహాలు లేవని చెప్పుకొచ్చారు. 2015లో ఇరాన్‌తో ఒబామా ప్రభుత్వం కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని గల్ఫ్‌ దేశాలు వ్యతిరేకించాయి. 2018లో ట్రంప్‌ ఆ ఒప్పందాన్ని రద్దు చేసినప్పుడు స్వాగతించాయి.
తాజాగా ఇరాన్‌-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం గల్ఫ్‌లో మరింత ఆందోళనలను రేకెత్తిస్తోంది. గల్ఫ్‌ దేశాలు వ్యక్తం చేస్తున్న సందేహాలకు ఈ ఒప్పందంలో సమాధానాలే లేవు. దీంతో అమెరికాపై వాటిలో నమ్మకం సడలిపోతోంది.

ఇరాన్‌తో ప్రాంతీయ ఒప్పందం?
యుద్ధం తర్వాత గల్ఫ్‌ దేశాలతో అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయన్న విషయంపై స్పష్టత లేదు. యూఏఈ వంటి దేశాలు మాత్రం అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెబుతున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం సైనిక కొనుగోళ్ల విషయంలో పక్క చూపులు చూస్తున్నాయి. కేవలం అమెరికా పైనే ఆధారపడకుండా టర్కీ వైపు మొగ్గు చూపుతున్నాయి. గల్ఫ్‌ భద్రతకు హామీదారుగా అమెరికా స్థానాన్ని భర్తీ చేసే సామర్ధ్యం ఏ ప్రాంతీయ శక్తికీ లేదన్నది సుస్పష్టం. అయితే అమెరికా పాత్రను పరిమితం చేసే విషయంపై గల్ఫ్‌ నేతలు ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ దిశగానే ఇరాన్‌తో ప్రాంతీయ ఒప్పందం కుదుర్చుకోవాలన్న యోచన కూడా ఉంది. అయితే అందుకు ఇరాన్‌ను ఒప్పించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఇరాన్‌ క్షిపణి కార్యక్రమం, టెహ్రాన్‌కు చెందిన ప్రాక్సీ ఉగ్రవాద గ్రూపుల నెట్‌వర్క్‌ వంటి సున్నితమైన సమస్యాత్మక అంశాలను పరిష్కరించడంలో ఒప్పందం విఫలమైంది. సౌదీ అరేబియా వద్ద క్షిపణులు ఉన్నప్పుడు ఇరాన్‌ వద్ద ఉండడం సమంజసమే కదా అని ఇటీవల ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఒప్పందం ప్రకారం ఇరాన్‌ పునర్నిర్మాణానికి 300 బిలియన్‌ డాలర్లతో నిధిని ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి గల్ఫ్‌ దేశాల సహకారం కూడా అవసరమే. దీనికి గల్ఫ్‌ నిధులు ఇస్తామని ట్రంప్‌ చెబుతున్నప్పటికీ ఆ వివరాలేవీ తమకు తెలియదని సౌదీ అరేబియా చెప్పింది. ఇరాన్‌ పునర్నిర్మాణ నిధికి మిత్రదేశాల నుంచి ఆర్థిధక సాయం కోరబోమని, అది చాలా కాలం తర్వాత చేయాల్సిన పని అని
రుబియో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -