రేసులో భారత్, దక్షిణాఫ్రికా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్
నవతెలంగాణ క్రీడావిభాగం
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను టైటిల్ ఫేవరేట్లలో ఒకరుగా మొదలుపెట్టిన టీమ్ ఇండియా.. గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆఖరుకు ఏకంగా సెమీఫైనల్లో చోటు కోసం ఇతర సమీకరణాలపై ఆధారపడాల్సిన దుస్థితి. ప్రపంచకప్ గ్రూప్-1లో ఆదివారం జరిగే రెండు మ్యాచ్‌లు ఈ గ్రూప్ నుంచి టాప్-2 జట్లను ఖరారు చేయనుంది. ఎనిమిది పాయింట్లతో ఆస్ర్టేలియా దాదాపుగా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా… ఈ గ్రూప్ నుంచి రెండో సెమీఫైనల్ బెర్త్ రేసులో టీమ్ ఇండియాతో పాటు దక్షిణాఫ్రికా పోటీపడుతున్నాయి. ఆదివారం జరిగే గ్రూప్-1 ఆఖరు మ్యాచ్‌ల్లో ఆస్ర్టేలియాతో భారత్ తలపడనుండగా, బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా పోటీపడనుంది.
క్లిష్టంగా సమీకరణాలు
ఆదివారం జరిగే గ్రూప్ దశ ఆఖరు మ్యాచ్‌లో ఆస్ర్టేలియాతో భారత్ తలపడనుంది. ఆస్ర్టేలియా గ్రూప్ దశలో తొలి 4 మ్యాచుల్లో గెలుపొంది 8 పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా, నెట్ రన్‌రేట్ పరంగా కంగారూ అమ్మాయిలు ముందంజలో ఉన్నారు. గ్రూప్-1 నుంచి తొలి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నారు. భారత్‌తో మ్యాచ్‌లో ఓడినా మెరుగైన నెట్ రన్‌రేట్ పరంగా ఆసీస్ ముందంజ వేయనుంది. ఇక భారత్ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించింది. పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. దీంతో సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. బలమైన ఆస్ర్టేలియాతో మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే టీమ్ ఇండియా సెమీఫైనల్ చేరుకోవటం ఖాయం. దక్షిణాఫ్రికాకు సైతం అవకాశాలు ఉన్నప్పటికీ.. అందుకు అద్బుతాలు జరగాల్సిందే.
రేసులోనే సఫారీలు
గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా అమ్మాయిలు 4 మ్యాచుల్లో మూడు విజయాలు సాధించారు. ఆసీస్ చేతిలో ఓడినా.. వరుసగా భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై విజయాలు సాధించారు. ఆఖరు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. బంగ్లాదేశ్‌పై సఫారీలు నెగ్గితే ఆ జట్టు సైతం 8 పాయింట్లు సాధించనుంది. ఆసీస్ చేతిలో భారత్ ఓడితే.. సఫారీలు నేరుగా సెమీస్‌కు చేరుకోనున్నారు. ఇటు సఫారీలు నెగ్గి.. అటు భారత్ నెగ్గితే.. మెరుగైన నెట్‌రన్‌రేట్ ప్రకారం టీమ్ ఇండియాకు టాప్-2 చోటు దక్కనుంది. దీంతో దక్షిణాఫ్రికాకు తమ విజయంతో పాటు భారత్ ఓటమి సైతం కోరుకుంటోంది. కానీ భారత్ తన మ్యాచ్‌లో విజయం సాధిస్తే చాలు.. ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా (అసాధారణ వ్యత్యాసం మినహాయిస్తే) సెమీఫైనల్ బెర్త్ దక్కించుకోనుంది. ఇక గ్రూప్-2 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్ సెమీఫైనల్‌కు చేరుకోగా.. మరో బెర్త్ కోసం వెస్టిండీస్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి.



