ఎల్‌నినో ఎఫెక్ట్…తరుముకొస్తున్న కరువు
తాగు, సాగు నీటికి కటకట అడుగంటుతున్న జలాశయాలు
సాగుపై తీవ్ర ప్రభావం కరెంటు ఉత్పత్తికీ కష్టమే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం క్రమంగా బలపడుతోంది. వర్షాలు కనుచూపు మేరలో కనిపించట్లేదు. ప్రాజెక్టుల్లోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా కరువు తరుముకొస్తోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల ప్రారంభ దశలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవాలి. కానీ ఈసారి అనేక జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అక్కడక్కడా వర్షాలు కురిసినా, వాటిని నమ్ముకొని రైతులు సాగులోకి దిగేందుకు జంకుతున్నారు. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగాన్ని అప్రమత్తం చేస్తున్నది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంట మార్పిడి చేసుకోవాలని కోరుతున్నది. అదే సమయంలో పొరుగు రాష్ట్రాలతో ఉన్న నీటి పంచాయతీల పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రోరెటా ప్రకారం రాష్ట్రవాటా నీటిని దక్కించుకోవాలని స్వయంగా సీఎం ఏ రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారుల్ని ఆదేశించారు. తాజాగా తుంగభద్ర నీటి వాటాల పంపకంపై కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సమక్షంలో కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చర్చలు జరిపారు. వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా బేసిన్లలోని 8 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వల సామర్థ్యం 587.81 టీఎమ్సీలు కాగా, ప్రస్తుతం ఆ జలాశయాల్లో 202.103 టీఎమ్సీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 70 టీఎమ్సీల నీరు తక్కువగా ఉంది. నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, మిడ్ మానేరు, కడెం, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహాలు రాకపోవడంతో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే అనేక జలాశయాల్లో నిల్వలు తక్కువగా ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు.
సాగుపై ప్రభావం
ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటల సాగు వర్షాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వర్షాలు ఆలస్యమైనా, తక్కువ వర్షపాతం నమోదైనా సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు. తొలకరి వర్షాలకు రైతులు కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు వేశారు. ఖరీఫ్ సాగు ఆలస్యమైతే రైతులు విత్తనాలు, ఎరువులు రెండోసారి కొనాల్సి వస్తుంది. దీనివల్ల దిగుబడులు తగ్గుతాయి. పెట్టుబడి భారం పెరుగుతుంది. భూగర్భ జలాల వినియోగం అధికమై, జలాలు అడుగంటే ప్రమాదం ఉంది.
తాగునీటి సమస్య
హైదరాబాద్‌తో పాటు పట్టణాలు, గ్రామాలకు తాగునీటిని అందించే జలాశయాల్లో నీటి నిల్వలు మరింత తగ్గితే సరఫరాపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. దీన్ని సమన్వయం చేసుకోవడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు.
కరెంటు కష్టాలు
సహజంగా ఏటా వర్షాకాలంలో జలవిద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అతితక్కువ ఖర్చుతో జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వర్షాలు లేక, నీటి నిల్వలు అడుగంటితే తప్పనిసరిగా థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి, మళ్లీ ప్రజలపై ఆర్థికభారాలు పడతాయి.
పశువులకూ కష్టకాలమే
వర్షాభావం కొనసాగి, చెరువులు, కుంటలు ఎండిపోతే పశువులకు కూడా తాగునీటి కొరత ఏర్పడుతుంది. పశుగ్రాసం లభ్యత తగ్గిపోతుంది. పాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
ఆర్థిక ప్రభావం
వ్యవసాయ ఉత్పత్తి తగ్గితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. వ్యవసాయ కూలీలకు ఉపాధి తగ్గడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ధాన్యం, కూరగాయలు, పశుగ్రాసం వంటి వస్తువుల ధరలు పెరుగుతాయి.
తాగునీటికే తొలి ప్రాధాన్యం
ప్రభుత్వం తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. రైతులకు వాతావరణ హెచ్చరికలు, పంటలపై సలహాలు అందించాలి. చెరువులు, చిన్న నీటి వనరులను వినియోగంలోకి తేవాలి. భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణ అవసరం. కచ్చితమైన నీటి నిర్వహణ, పంటల ప్రణాళిక, సాగునీటి పంపిణీలో ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమైన అంశాలు.
పరిశ్రమలపై ప్రభావం
ఔషధ, ఆహార ప్రాసెసింగ్, విద్యుత్ వంటి పరిశ్రమలకు నీటి అవసరం ఎక్కువ. నీటి కొరత ఏర్పడితే పరిశ్రమలకు కేటాయింపులు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఆయా పరిశ్రమల ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోతాయి.
ఎల్‌నినో అంటే…
ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితి. దీనివల్ల భారతదేశంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. ఫలితంగా వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడతాయి.
నీటి కటకట ఇలా…(టీఎమ్‌సీల్లో)
రిజర్వాయర్ నీటి నిల్వ ప్రస్తుత గతేడాది ఇదే టైంకి సామర్థ్యం నీటిమట్టం నీటిమట్టం
ఉస్మాన్‌సాగర్ 3.900 2.403 2.538
హిమాయత్‌సాగర్ 2.967 2.334 2.037
సింగూర్ 29.917 4.497 19.256
మంజీరా 1.500 0.382 0.561
అక్కంపల్లి (కృష్ణా) 1.499 1.201 1.224
నాగార్జునసాగర్ 312.045 141.190 139.080
శ్రీశైలం 215.807 42.340 98.900
శ్రీపాద ఎల్లంపల్లి 20.175 7.756 8.624
మొత్తం 587.81 202.103 272.22



