నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో సన్న బియ్యం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. రేషన్ కార్డుల ద్వారా పేదలకు ఉచితంగా సన్నబియ్యం ఇస్తుండటంతో మెదట్లో ధరలు తగ్గినా.. గత రెండు నెలలుగా వ్యాపారులు వరుసగా ధరలు పెంచుతుండటంతో మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. హెచ్‌ఎంటీ, బీపీటీ, తెలంగాణ సోనా, సాంబా, జై శ్రీరామ్ వంటి రకాల ధరలు క్వింటాల్‌కు రూ.800 నుంచి రూ.1200 వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వరి సాగు తగ్గుతుందన్న అంచనాలను వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది పంట తగ్గుతుందని, సన్న రకాల బియ్యానికి కొరత ఏర్పడుతుందని ప్రచారం జరగడంతో ముందుగానే భారీగా నిల్వలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా మార్కెట్‌లో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఏడాది ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన తర్వాత కొంతకాలం మార్కెట్‌లో ధరలు తగ్గాయి. హెచ్‌ఎంటీ, కర్నూల్ మసూరి, జై శ్రీరామ్, ఆర్‌ఎన్‌ఆర్, సాంబా రకాల ధరలు క్వింటాల్‌కు దాదాపు రూ.1000 వరకు తగ్గాయి. అయితే జూలై నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం నాణ్యత, పాత పంట, పాలిషింగ్, బ్రాండ్‌ను బట్టి హోల్‌సేల్ మార్కెట్‌లో సన్న బియ్యం క్వింటాల్ ధర రూ.5400 నుంచి రూ.7,000 వరకు పలుకుతోంది.
రిటైల్ మార్కెట్‌లోనూ ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. సన్న బియ్యం కిలో ధర రూ.55 నుంచి రూ.75 వరకు ఉండగా.. ప్రీమియం ప్యాకెట్ రకాల ధరలు రూ.65 నుంచి రూ.75 వరకు ఉన్నాయి. మహబూబాబాద్‌లో జూన్‌లో క్వింటాల్‌కు రూ.4600గా ఉన్న హెచ్‌ఎంటీ ధర ఆగస్టులో రూ.5500కు చేరింది. జై శ్రీరామ్ ధర రూ.5600 నుంచి రూ.6300కు పెరిగింది.



