Wednesday, February 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిహిందూ మతం ఎప్పుడు పుట్టింది?

హిందూ మతం ఎప్పుడు పుట్టింది?

- Advertisement -

”మనమంతా హిందువులం, మనమంతా బంధువులం” అని ఇటీవల కొందరు అదేపనిగా నినాదాలిస్తున్నారు. అసలు భారతదేశంలోని మెజారిటీ ప్రజలు హిందువులు అనే భావన ఎప్పుడు మొదలయింది? తెలుసుకుందాం. భారతదేశంలోని ఏ పవిత్ర గ్రంథమూ, ఏ మత నాయకుడూ, ఏ మహా పండితుడూ మొదటగా ‘మనం హిందువులం’ అనే పదం వాడలేదు. అనాది నుండి ఇంగ్లీషు వారు వచ్చేవరకు మన మత నాయకులు ప్రజలను అనేక మతాలవారుగా పేర్కొన్నారే గాని హిందువులు అనే పదం ఎక్కడా వాడలేదు. ఉదాహరణకు వైదిక మతస్తులు లేక బ్రాహ్మణ మతస్తులు, బౌద్ధ మతస్తులు, జైన మతస్తులు, నాస్తిక మతస్తులు, అద్వైతులు, విశిష్టా ద్వైతులు, ద్వైతులు, శ్రీ వైష్ణవులు,శైవులు ఇలా పేర్కొన్నారు. మహా పండితుడైన డా.సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు కూడా భారతీయుల మతాలను గూర్చి వివరిస్తూ బ్రాహ్మణ మతము,శివ,విష్ణు మతములు అనే పేర్కొన్నాడు. కానీ, హిందూమతమును గూర్చి ఎక్కడా పేర్కొనలేదు.

తాను రచించిన ‘భారతీయ తత్వశాస్త్రము’ అనే గ్రంథములో,ద్వితీయ భాగం, అష్టమాధ్యాయములోని ఒక ఉపశీర్షికకు ‘బ్రాహ్మణ మత పునర్నిర్మాణము’ అనే పేరు పెట్టాడు (పేజీ 240). అంతేకాదు, మరింత వివరంగా ఇలా రాశాడు ”క్రీ.వె. పథమ శతాబ్దిలో రాజ్యము చేసిన గుప్తుల కాలమున బ్రాహ్మణ మతము పునరుజ్జీవితమైనది. శివ,విష్ణు మత శాఖలు జన సామాన్యములో వ్యాపించినవి(పేజీ 372). మరొకచోట ”ఇంచుమించు ఒక వేయి సంవత్సరముల కాలము బ్రాహ్మణ మతము జాతీయ మతమై విలసిల్లియుండగా, బౌద్ధ మతము దాన్ని జీర్ణింప చేసి రెండు శతాబ్దాలలో భారత రాజ్యధర్మమై ప్రకాశించినది”( అదే పుస్తకం, పేజీ 235). అంటే బౌద్ధమతం ప్రభావానికి రాకముందు విలసిల్లిన మతం బ్రాహ్మణ మతం అనీ, క్రీస్తు వెనుక ప్రధమ శతాబ్దిలో మరలా పునరుజ్జీవితమైన మతం కూడా బ్రాహ్మణ మతమనీ, ఆ కాలములోనే వ్యాపించిన మతాలు శివ, విష్ణు మతాలనీ స్పష్టంగా పేర్కొన్నాడు.

ఈ వివిధ మతాలవారు ఒకరి నొకరు తీవ్రంగా ద్వేషించుకున్నారు. ‘తమ దైవాన్ని తప్పితే ఇతర దేవతల పేర్లను ఉచ్చరించినా పాపం’ అన్నారు. దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను.ప్రసిద్ధ నవలాకారుడు దాశరధి రంగాచార్య తన జీవిత చరిత్ర ‘జీవన యానం’లో ఇలా రాశారు.”మేము శాత్తిన వైష్ణవులం….. ఒకే పరమాత్ముడు శ్రీమన్నారాయణుని నమ్ముకునేది వైష్ణవం. శ్రీమన్నారా యణుడు ఒక్కడే భగవానుడు. అన్యులు దేవతలు కారు. శ్రీమన్నారాయణుని మాత్రమే ఆశ్రయించాలి. అన్య దేవతలను ఆశ్రయించడం పాపహేతువు. శివుని పేరు ఉచ్చరించడం మహాపాపం.

ఒక్క శివుణ్ణి మాత్రం నమ్ముకున్నది శైవం. శివుని మించిన దేవత లేడు. శివుని వీరభక్తి పూర్వకంగా ఆరాధించిన వారికి మోక్షం లభిస్తుంది. అన్య దేవతలను ఆరాధించడం పాపహేతువు. మేము గుంటి మల్లన్న బజారులో ఉన్నాం. మా ఇంటికి కొద్ది దూరంలోనే శివాలయం.అది చుట్టు తిరుగుడు అయినా మా నాయనగారు శివాలయం వెనుక నుంచి వెళ్లేవారు తప్ప ముందు నుంచి వెళ్లేవారు కారు. మల్లేశ్వర స్వామి సేవ వస్తే, తలుపులన్నీ బిగించి దొడ్లో కూర్చునేవారు(పేజీలు 65,66). తన బాల్య జీవితంలోని ఒక అనుభవాన్ని దాశరధి రంగాచార్య ఇలా వివరించారు.

”నేను మూడవ తరగతిలో ఉన్నాను. ఉర్దూ వాచకం చదివించే పీరియడ్‌ ఉండేది. నేను చదువుతున్నాను. ‘శివారు’ అనే పదం వచ్చింది. ఉర్దూలో ‘శివారు’ అంటే ‘తప్ప’ అని అర్థం. నేను వీరవైష్ణవుణ్ణి. ‘శివ’ అంటానా? అక్కడ ఆగిపోయాను. టీచర్‌ షేక్‌ మీరా చదవమన్నాడు. నేను మౌనం వహించాను. అతడు పేము బెత్తంతో బాదుతున్నాడు. అయినా నేను పలకను. సర్వయ్య మా నాయన శిష్యుడు. ఆ బడిలో ముద్రిస్‌ అంటే టీచరు. వారికి నేనంటే ఎంతో ప్రేమ. షేక్‌ మీరా నన్ను బాదుతుండటం చూశారా యన. పరుగెత్తుకు వచ్చారు. వారించారు. విషయం అడిగారు.”బచ్చా హుషార్‌ హై,ఆగే పఢ్తా నహీ”(పిల్లవాడు తెలివైనవాడే, తరువాతిది చదవడు) అన్నాడు. నన్ను అడిగారు. ‘శివారు’ వేలుతో చూపించి ‘ఇది చదవను’ అన్నాను. సర్వయ్య చేతితో తలబాదుకున్నాడు. ”ఆ దూర్‌ డాలియే, యV్‌ా నహీకహేగా”(మీరు చంపండి, ఈ మాటలనడు) అని కారణం వివరించారు. అప్పుడు క్లాసులో పిల్లలు, టీచర్‌ అంతా గొల్లున నవ్వారు.(జీవనయానం, పేజీ 66).
ఇలా ఉండేవి భారతదేశంలో శైవ మత, వైష్ణవ మత విభేదాలు, విద్వేషాలు.

మరో ముఖ్య విషయం.ప్రముఖ చరిత్రకారుల పరిశోధనల ప్రకారం ఆంగ్లేయుల చేతిలో పీష్వాలు ఓడిపోయిన తరువాత ‘పీష్వారాజ్‌’ అంతమయింది. ‘పీష్వారాజ్‌’ అంతాన్ని ‘బ్రాహ్మణ రాజ్‌’ అంతంగా ఆంగ్లేయులు వర్ణించారు. ఉదాహరణకు క్రీ.శ 1800లో నానా ఫడ్నవిస్‌ అనే ప్రముఖ మరాఠా నాయకుడు చనిపోయినప్పుడు కెప్టెన్‌ బ్రౌనింగ్‌ అనే ఆంగ్లేయ సైన్యాధికారి ఇలా వ్యాఖ్యానించాడు ”నానా వెళ్లిపోయాడు. అతనితో బ్రాహ్మణ రాజ్‌ వెళ్లిపోయింది” అని.(‘ఇండియా సిన్స్‌1526’ అనే గ్రంథం నుండి. రచన: ప్రొ|| వి. డి. మహాజన్‌ ,పేజీ 143)

ఇలా పీష్వాల పాలనను ‘బ్రాహ్మణ రాజ్‌’ అన్నారే గాని ‘హిందూ రాజ్‌ ‘అని అప్పటి ఆంగ్లేయులు అనలేదు.మరి అనాది నుండి ఈ దేశ ప్రజలను ఏమని పిలిచేవారు? భారతీయులు అని పిలిచేవారు. విష్ణు పురాణంలోని ఈ క్రింది శ్లోకాన్ని పరిశీలించండి.
శ్లో ఉత్తరం యత్సముద్రస్య, హిమాద్రేశ్చైవదక్షిణం
వర్షతత్భారతం నామ, భారతీ యత్ర సంతతి:||
అంటే ”సముద్రానికి ఉత్తరాన ,హిమాలయ పర్వతానికి దక్షిణాన, వ్యాపించి ఉన్న భూమి భారత వర్షము. దాని సంతానము భారతీయులు.”
మరి ఈ దేశంలోని మెజారిటీ ప్రజలు హిందువులు ఎప్పుడైనారు? వారిని ‘హిందువులు’ అని మొదటగా ఎవరు పిలిచారు? ఎప్పుడు పిలిచారు?
క్రీ.శ. 1787లో చార్లెస్‌ గ్రాంట్‌ అనే ఆంగ్లేయ అధికారి భారతదేశంలో నివసించే క్రైస్తవ ,ముస్లిం, పార్సీ, సిక్కు మతాలకు చెందకుండా ఉన్న మిగిలిన అందరినీ ‘హిందువులు’ అన్నాడు.(గూగుల్‌ లో ‘ది మాన్‌ హూ కాయ్నిడ్‌ హిందూయిజం’ అని క్లిక్‌ చేయండి).అయితే అధికారికంగా ఈ దేశంలోని మెజారిటీ ప్రజలను ‘హిందువులు’గా మొట్టమొదటిసారి 1872లో జనాభా లెక్కలలో పేర్కొన్నారు. దీనికి కారణం ఏమిటి?

1857లో ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్‌, తాంతియా తోపే లాంటి భారతీయులంతా ఢిల్లీ పాలకుడూ, మొగలు వంశం వాడూ అయిన రెండవ బహదూర్‌ షా నాయకత్వంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడారు.భారతీయ వీరులు ఓడిపోయినా వారు మరల ఐక్యంగా పోరాడి బ్రిటిష్‌ వారిని భారతదేశం నుండి వెళ్లగొట్టే ప్రమాదం పొంచి ఉందని ఆంగ్లేయులు గ్రహించారు. అందుకని వారు భారతీయులలో ‘విడగొట్టి -పాలించు’ అనే సూత్రాన్ని అనేక విధాలుగా అమలు చేయడం మొదలెట్టారు.అందులోని ఒక ఎత్తుగడే ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు, సిక్కులు కాని వారందరూ హిందువులు అంటూ అవకాశమున్న ప్రతి సందర్భంలోనూ భారతీయులను విడదీశారు. అలా ఆంగ్లేయుల కుట్రలో భాగమే ‘హిందూమతం’ అనే మతం యొక్క సృష్టి.

ఆ ప్రకారంగా ఐకమత్యంగా ఉన్న భారతీయులను రెండు బలమైన విరోధివర్గాలుగా మార్చాలనే కుట్రలో భాగమే మెజారిటీ ప్రజలను ‘హిందూమతస్తులు’ అనే పదంతో పిలవడం. ఆంగ్లేయుల కుట్రపూరితమైన ఈ ఎత్తుగడను ఆరెస్సెస్‌, బీజేపీలు అనుసరించి, తమ క్రోనీ క్యాపిటల్‌ లిస్టు చర్యలను కార్మిక, కర్షక వర్గం ఐకమత్యంతో ఎదుర్కొనకుండా అదే ‘విభజించి-పాలించు’ విధానంతో దేశాన్ని దోచుకుంటున్నాయి.దేశభక్తులైన ప్రజలు ఈ కుట్రను అర్థం చేసుకుని వారి దోపిడీకి అడ్డుకట్ట వేయాలి.

కె.ఎల్‌.కాంతారావు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -