నవతెలంగాణ – హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఓ పాఠశాలలో ఉర్దూ బోధిస్తున్నారన్న కారణంతో ప్రిన్సిపాల్‌పై కొందరు బీజేపీ నేతలు దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల సమక్షంలోనే ప్రిన్సిపాల్‌ను చెంపదెబ్బ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయంపై రాజకీయంగా దుమారం రేగింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని భారత్ చంద్ర పాఠశాలలో శనివారం ఈ ఘటన జరిగింది. పాఠశాల యాజమాన్యం ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ అమెర్ ఖాన్, ఉర్దూను ద్వితీయ భాషగా బోధించేందుకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానిక బీజేపీ నేతలు పాఠశాలలోకి ప్రవేశించి, తమ పిల్లలకు ఉర్దూ పాటలు, మతపరమైన అంశాలు నేర్పుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారు ప్రిన్సిపాల్ అమెర్ ఖాన్‌పై దాడి చేసి, చెంపదెబ్బ కొట్టారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ షమా మొహమ్మద్ తీవ్రంగా స్పందించారు. “తెలంగాణలోని ఓ పాఠశాలలోకి బీజేపీ గూండాలు చొరబడి, పోలీసుల ముందే ఉర్దూ బోధిస్తున్న ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో సంబంధిత పోలీసు అధికారులను సస్పెండ్ చేసి, బీజేపీ గూండాలను కఠినంగా శిక్షించాలి” అని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ చెప్పే ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ ఎక్కడ? అని ఆమె ప్రశ్నించారు.



