భారత్‌పై ఐర్లాండ్ చారిత్రక విజయం
రెండో టీ20లో 1 పరుగు తేడాతో గెలుపు
0-2తో సిరీస్‌లో ఇండియాకు వైట్‌వాష్ ఓటమి
ఐర్లాండ్ చర్రిత సృష్టించగా, ప్రపంచ చాంపియన్‌కు దారుణ భంగపాటు. పేస్, బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన టీమ్ ఇండియా టీ20 సిరీస్‌ను 0-2తో ఐర్లాండ్‌కు కోల్పోయింది. దీంతో పొట్టి ఫార్మాట్లో వరుసగా 12 సిరీస్ విజయాలు సాధించిన భారత్ జైత్రయాత్రకు పసికూన ఐర్లాండ్ బ్రేక్ వేసింది. ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేయగా, హ్యారీ టెక్టర్ (53) అర్థ సెంచరీతో రాణించాడు. ఛేదనలో తిలక్ వర్మ (55) అర్థ సెంచరీతో పోరాడినా భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులే చేసింది. ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఐర్లాండ్ చేతిలో భారత్‌కు ఇది తొలి సిరీస్ ఓటమి.
నవతెలంగాణ-బెల్ఫాస్ట్
ఐర్లాండ్ అద్భుతం చేసింది. టీ20 ప్రపంచ చాంపియన్ టీమ్ ఇండియాపై చారిత్రక సిరీస్ విజయం సాధించింది. మూడు రోజుల వ్యవధిలో భారత్‌పై రెండు సార్లు విజయం సాధించిన ఐర్లాండ్ 2-0తో టీ20 సిరీస్‌ను ఏకంగా క్లీన్‌స్వీప్ చేసింది. ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఆ జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. ఆదివారం బెల్ఫాస్ట్లో జరిగిన రెండో టీ20లో ఆతిథ్య ఐర్లాండ్ 1 పరుగుల తేడాతో గెలుపొందింది. 155 పరుగుల ఛేదనలో భారత్ చతికిల పడింది. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (55, 46 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో పోరాడిన ఫలితం లేకపోయింది. ఓపెనర్లు సంజు శాంసన్ (0), అభిషేక్ శర్మ (0) సున్నా పరుగులకే అవుటవగా.. ఇషాన్ కిషన్ (12), శ్రేయస్ అయ్యర్ (10) బాధ్యతగా ఆడటంలో విఫలం అయ్యారు. తిలక్ వర్మ ఓ ఎండ్‌లో నిలబడినా.. అక్షర్ పటేల్ (14), శివం దూబె (20), సూర్యాన్షు షెడ్జె (1) ఆశించిన సహకారం అందించలేదు. ఆఖర్లో హర్షిత్ రానా (21), ప్రిన్స్ యాదవ్ (6 నాటౌట్) పోరాడినా భారత్‌కు భంగపాటు తప్పలేదు. పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లలో భారత్‌పై పైచేయి సాధించిన ఐర్లాండ్.. అద్వితీయ విజయంతో స్వదేశంలో క్రికెట్ అభిమానుల సంబురాలకు తెరతీసింది.
రాణించిన టెక్టర్
వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానాలు ఓపెనర్లను అవుట్ చేసి బ్రేక్ అందించినా.. ఆతిథ్య ఐర్లాండ్ పవర్‌ప్లేలో 44 పరుగులు చేసింది. టిమ్ టెక్టర్ (5), రాస్ అడైర్ (16)లు ఎదురుదాడికి ప్రయత్నించినా వికెట్లు నిలుపుకోలేదు. హ్యారీ టెక్టర్ (53), కెప్టెన్ లోర్కాస్ టకర్ (15)తో కలిసి 27 పరుగులు జోడించాడు. టకర్‌ను ప్రిన్స్ యాదవ్ సాగనంపినా.. బెన్ కాలిట్జ్ (37) జతగా టెక్టర్ జోరందుకున్నాడు. ఈ ఇద్దరూ నాల్గో వికెట్‌కు 44 బంతుల్లోనే 65 పరుగులు చేశారు. వర్షంతో ఇన్నింగ్స్‌కు అంతరాయం కలిగినా.. టెక్టర్ జోరు తగ్గలేదు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన టెక్టర్.. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఐర్లాండ్‌కు మంచి స్కోరు అందించాడు. ఆఖర్లో జార్జ్ డాక్రెల్ (19) సైతం రాణించాడు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు ఐర్లాండ్ 154 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ప్రిన్స్ యాదవ్ (3/22), శిం దూబె (2/25), అర్ష్‌దీప్ సింగ్ (2/35) రాణించారు.



