ఇలాగైతే ఢిల్లీలా తెలంగాణ
17 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలకు నిప్పు
టన్ను వ్యర్థాల కాల్చివేతతో 60 కిలోల
కార్బన్ మోనాక్సైడ్ విడుదల
అగ్నికి ఆహుతవుతున్న మంచి
సూక్ష్మజీవులు, వానపాములు
కాల్చివేతతో గాలిలో పెరుగుతున్న
పొటాష్, భాస్వరం, నత్రజని వాయువులు
రాష్ట్రంలో క్రమంగా దెబ్బతింటున్న భూసారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వద్దన్నా.. పంట వ్యర్థాలను అన్నదాతలు యథేచ్ఛగా కాల్చేస్తున్నారని, తెడానకుండానే వారు భూమిని చేజేతులా నిస్సారం చేస్తున్నారని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాల యం వెల్లడించింది. ఏప్రిల్, మే, జూన్‌లలో 17 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను కాల్చివేసినట్టు వైస్‌చాన్స్‌లర్ అల్దాస్ జానయ్య విడుదల చేసిన నివేదిక పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. అందులో 9 లక్షల ఎకరాల పంట వ్యర్థాలు వరి పంటవే. టన్ను పంట వ్యర్థాల కాల్చివేతతో గాలిలోకి 60 కిలోల కార్బన్ మోనాక్సైడ్ , 1460 కిలోల కార్బన్ డయాక్సైడ్ , 200 కేజీల బూడిద విడుదలవుతున్నది. భూమిలో పోషకాల రూపంలో ఉండాల్సిన పొటాష్, భాస్వరం, నత్రజని కూడా వాయువు రూపంలో పెద్ద ఎత్తున గాలిలో కలిసిపోతు న్నాయి. ఇలా గాలిలో ఆ వాయువులు క్రమంగా పెరుగుతూ పర్యావరణ సమతుల్య తకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇప్పటికే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేతతో దేశరాజధానిలో గాలి నాణ్యత క్రమంగా పడిపోతూ అక్కడ బతకలేని దుస్థితి నెలకొన్నది. తెలంగాణలోనూ ఇలాగే పంట వ్యర్థాలను కాల్చుతూ పోతే హైదరాబాద్ మహానగరం కూడా మరో ఢిల్లీలా మారే ప్రమాదం పొంచి ఉందని వ్యవసాయ విశ్వవిద్యా లయం హెచ్చరిస్తున్నది. పంట వ్యర్థాల కాల్చివేత వల్ల భవిష్యత్తులో కలుగబోయే నష్టం గూర్చి రైతులకు విడమర్చి చెప్పే విషయంపై వ్యవసాయ శాఖ మరింత దృష్టిసారించాలనే విషయాన్ని ఎత్తిచూపుతున్న ది. ఒకే రకమైన పంటలు వేస్తుండటం, పంట వ్యర్థాలను యథేచ్ఛగా కాల్చేస్తుండటం వల్ల భూమి భూసారం క్రమంగా తగ్గిపోతున్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో పంట వ్యర్థాలను తగులబెడితే భూసారం తగ్గుతుందనీ, అలా చేసే వారిపై ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామనీ, జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. అయినా పంట వ్యర్థాల కాల్చివేత మాత్రం ఆగలేదు. తెలంగా ణలో అధికారిక గణాంకాల ప్రకారం 2025-26 రబీ సీజన్‌లో 74,80,171 ఎకరాల్లో పంట సాగుకాగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇటీవల నెలకొ ల్పిన అధునాతన రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మేటిక్ సిస్టం ప్రయోగశాలలో గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపగ్రహ ఛాయా చిత్రాలని విశ్లేషించి 16,85,544 ఎకరాల్లో పంట వ్యర్థాలను రైతులు తగులబెట్టినట్టు తేలింది. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది. 44.6 లక్షల ఎకరాల్లో వరి పంట వేయగా…అందులో 9.05 లక్షల వరి పంట వ్యర్థాలను రైతులు పొలంలో నే తగులబెట్టారు. మొక్కజొన్న, జొన్న, పత్తి ఇతర పంటలు 30.2 లక్షల ఎకరాల్లో సాగవ్వగా అందులో 8.5 లక్షల పంట వ్యర్థాలను పొలాల్లోనే కాల్చేశారు. పంట వ్యర్థాలను ఎక్కువగా తగులబెట్టిన జిల్లాల జాబితాలో నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, కరీం నగర్, పెద్దపల్లి జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. ఆ ఐదు జిల్లాల వాటా 35 శాతం ఉండటం గమనార్హం. అతి తక్కువ కాల్చిన జాబితాలో రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, వనపర్తి జిల్లాలున్నాయి.
ఇలాగైతే.. తెలంగాణ కాలుష్యమయమే…
పంట వ్యర్ధాలు కాల్చివేయడం వల్ల నేల ఆరోగ్యం, గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింటు న్నాయి. అంతేకాక నేలలోని రెండున్నర సెంటిమీట ర్ల దిగువ భాగంలో ఉండి, భూ సారానికి, పంటలకి లాభసాటిగా దోహదపడే మంచి బ్యాక్టీరియా, ఫంగల్ సూక్ష్మ జీవులు అగ్నికి ఆహుతై నేల నిస్సారంగా తయారవుతున్నది. ఒక టన్ను వరిగడ్డి, కొయ్యలని పంట పొలాల్లో కాల్చివేయడం వల్ల ఐదున్నర కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్ గాలిలో కలిసిపోతున్నాయి. ఒక ఎకరానికి సుమారు రెండున్నర టన్నుల వరిగడ్డి వ్యర్ధాలు వస్తాయి. ఒక ఎకరం వరి విస్తీర్ణంలో ఈ పంట వ్యర్ధాలని కాల్చితే 13.5 కిలోల భాస్వరం, 6.75 కిలోల పొటాష్ గాలిలో కలసిపోయి తద్వారా గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతుంది. ఈ లెక్కల ప్రకారం 23.63 లక్షల కిలోల నత్రజని, 11.90 లక్షల కిలోల భాస్వరం,1062 లక్షల కిలోల పొటాష్ ఈ మూడు మాసాలలోనే పంట వ్యర్ధాల కాల్చివేత వల్ల గాలిలో కలిసిపోయాయి. వాటిని కాల్చకుండా తిరిగి నేలలోనే కలియదున్ని కొంత కాలం కుళ్ళనిచ్చినట్లయితే నేల సారం పెరగటంతో పాటు కాలుష్యం తగ్గేది. అంతే కాకుండా ఒక టన్ను పంట వ్యర్ధాల కాల్చివేత వల్ల 60 కిలోల అతి ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్, 1460 కిలోల కార్బన్‌డయాక్సైడ్, 200 కిలోల బూడిద గాలిలో కలిసిపోతున్నాయి.
హెచ్చరిస్తున్నా ఆగని కాల్చివేత
పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్థాలను బహిరంగంగా దహనం చేయటాన్ని పూర్తిగా నిషేధిస్తూ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ జీవో 27ని విడుదల చేసింది. భూములపై, చెత్త మైదానాల్లో (ల్యాండ్‌ఫిల్ సైట్లలో), ఇతర ప్రదేశాలలో వ్యర్థాలను బహిరంగంగా కాల్చడాన్ని నిషేధించింది. సాధారణంగా వ్యర్థాలను కాల్చితే రూ.5,000, భారీ స్థాయిలో వ్యర్థాలను కాల్చినట్లయితే రూ.25,000 పర్యావరణ పరిహారం విధిస్తామని వ్యవసాయ శాఖ హెచ్చరించింది. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నడం ద్వారా భూసారం మెరుగుపడటంతో పాటు సేంద్రీయ కార్బన్ పెరుగుతుందనీ, రసాయన ఎరువుల వినియోగం తగ్గి పంట దిగుబడులు పెరుగుతాయని వ్యవసాయ శాఖ సూచించింది. అయినా పంట వ్యర్థాల కాల్చివేత మాత్రం ఆగడం లేదు.
జరిగే నష్టాలివే..
పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రీయ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాష్ తో పాటు సూక్ష్మ పోషకాలు నశించి భూమి నిస్సారంగా మారుతుంది. భూమికి మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు నశించడం వల్ల నేల జీవసత్తువ కోల్పోయి, పంట దిగుబడులు క్రమంగా తగ్గిపోతాయి. పంట వ్యర్థాల దహనం వల్ల విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు గాలి కాలుష్యాన్ని పెంచి ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాగే రోడ్లపై పొగమంచు ఏర్పడి ప్రమాదాలు పెరిగే అవకాశముంది. ఇప్పటికే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను పెద్ద ఎత్తున కాల్చడం వల్ల ఢిల్లీలో వాతావరణ కాలుష్యం రోజురోజుకీ పెరిగిపో తున్నది. అక్కడ గాలి నాణ్యత క్రమంగా పడిపో తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ ఇలాగే పంట వ్యర్థాలను కాలుస్తూ పోతే మన రాష్ట్రంలోనూ వాతావరణ కాలుష్యం పెరిగే ప్రమాదముంది. అత్యంత నివాసయోగ్య నగరంగా పేరొందిన హైదరాబాద్‌కు కూడా దీని ముప్పు పొంచి ఉంది.
రైతులకు సూచనలు, సలహాలివ్వాలి
టి.సాగర్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
‘పంట వ్యర్ధాలు భూమిలో తొందరగా మురిగిపోయేలా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి రైతులకు సలహాలివ్వాలి. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులున్నారు. వారు నేరుగా రైతుల వద్దకెళ్లి పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పాలి. వ్యర్థాలను తగులబెట్టడం వల్ల సహజంగా భూమిలో ఉండే పొటాష్, భాస్వరం, నత్రజని, కర్భనం వంటి మూలకాలు ఎలా పోతాయి? వాటిని మనమే తిరిగి ఎరువుల రూపంలో పంటలకు అందిస్తున్నాం? పంట వ్యర్థాలను ఎరువులుగా ఎలా మార్చొచ్చు? రసాయన ఎరువుల వాడకాన్ని ఎలా తగ్గించవచ్చు? అలాగైతే రైతుకు ఎకరాకు ఎంత మిగులుతుంది? రైతు ఆర్థికంగా ఎంత లబ్ది పొందుతాడు? అనే విషయాలపై అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ వైఫల్యం ఉంది. దీనిపై వ్యవసాయ శాఖ మరింత దృష్టి సారించాలి. పంట వ్యర్థాలను ఇంత పెద్ద మొత్తంలో కాల్చడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది వాతావరణానికి, ప్రజల ఆరోగ్యానికి, రైతులకు నష్టదాయకం’.
వద్దన్నా..పంట వ్యర్థాల కాల్చివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



