కేవీపీఎస్ రాష్ట్రస్థాయి సమావేశంలో స్కైలాబ్‌బాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ విద్య, వైద్య పరిరక్షణ కోసం రెండునెలలపాటు దశలవారీగా ఆందోళనలను నిర్వహిస్తామని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు వెల్లడించారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగువేలకు కుదించే యత్నాన్ని సర్కారు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున, నందిపాటి మనోహర్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా స్కైలాబ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ దవాఖానా, గ్రంథాలయం, క్రీడా మైదానం ఉండటం వల్ల యువత సరైన మార్గంలో ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం అందుకు భిన్నంగా గల్లీ, గల్లీకి బ్రాంది షాపులు తెరుస్తూ… ప్రభుత్వ పాఠశాలను కుదిస్తూ… పేద, దళిత విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ యధేచ్చగా కొనసాగుతోందని, వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలేబుల్ స్కీమ్ కింద ప్రభుత్వ, కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సుమారు 23 వేల మంది భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీబీ గ్రామ్ జీ బిల్లు పేరిట కూలీల పొట్టలు కొట్టే చర్యలకు పూనుకుందని చెప్పారు. జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న వీబీగ్రామ్ జీ రాంజీ బిల్లును వ్యతిరేకిస్తూ కూలీ, రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనకు కేవీపీఎస్ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ప్రత్యక్ష పోరాటాల్లో భాగస్వామి అవుతుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట గోపి, దుడ్డేల రామ్మూర్తి, మంద సంపత్ ,రాష్ట్ర సహాయ కార్యదర్శులు తిప్పారపు సురేష్, దుర్గం దినకర్, బోట్ల శేఖర్, పులిజాల పరుశరాములు పెద్దాపురం అశోక్, ఉప్పల మల్కయ్యతోపాటు వివిధ జిల్లాల కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్య, వైద్య పరిరక్షణ కోసందశల వారీగా ఉద్యమాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



