1983 నాటి కనిష్ట స్థాయికి పతనం
వాషింగ్టన్ : అమెరికా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు భారీగా పడిపోయాయి. గత వారం రోజుల్లోనే సుమారు 55 లక్షల బ్యారెళ్ల చమురు నిల్వలు తగ్గడంతో ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న నిల్వలు 32.57 కోట్ల బ్యారెళ్లకు పరిమితమయ్యాయి. ఇది 1983 మే నెల తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి నిల్వలని అని అమెరికా ఇంధన శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వల కొరతను అధిగమించేందుకు అమెరికా తీసుకున్న నిర్ణయమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న ఇంధన సంక్షోభాన్ని తగ్గించేందుకు.. ఇంధన ధరలను నియంత్రించేందుకు అమెరికా వ్యూహాత్మక నిల్వల నుంచి 17.2 కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని గతంలోనే నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం నిల్వలను విడుదల చేస్తోంది. దీనికి తోడు అమెరికా నుంచి ముడి చమురుకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతులు పెరగడం, రిఫైనరీల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా నిల్వలు వేగంగా ఖాళీ అవుతున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జూన్ 19 నాటికి అమెరికా చమురు వాణిజ్య నిల్వలు, వ్యూహాత్మక నిల్వలు కలిపి మొత్తం 11.14 కోట్ల బ్యారెళ్లు తగ్గాయి. దీంతో మొత్తం నిల్వలు 74.33 కోట్ల బ్యారెళ్లకు పడిపోయాయి. ఇది 1984 తర్వాత అత్యంత కనిష్ట స్థాయిగా చోటు చేసుకుంది. ఇంధన భద్రతపై నెలకొన్న ఈ పరిణామాలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బ్యారెల్ ధర 70 డాలర్లకు తగ్గొచ్చు : మోర్గాన్ స్టాన్లీ
గత రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి ముడి చమురు ధరల అంచనాలను ప్రముఖ ఫైనాన్సీయల్ కన్సల్టెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తగ్గించింది. హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా ఆశించిన దానికంటే వేగంగా పుంజుకోవడం చైనాలో డిమాండ్ బలహీనపడటం వంటి కారణాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరా పెరిగి.. ధరలు పడిపోయే ప్రమాదం ఉందని ఆ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు, నాలుగు త్రైమాసికాల్లో బ్యారెల్ సగటు ధర 75 డాలర్లకు పరిమితం కావచ్చని పేర్కొంది. 2027 చివరి నాటికి ధర 70 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.
అమెరికా చమురు నిల్వల్లో భారీ తగ్గుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



