కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయం ఎంహెచ్ భవన్ లో జీఎం రఘు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ విశ్లేషకులు ఎం కొటేశ్వర రావు హాజరైయ్యరు. ఈ సందర్భంగా కొరటాల సత్యనారాయణ చిత్రపటానికి నివాళు అర్పించారు. వారితో పాటు సంస్థ సీజీఎం పి. ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేష్, బుక్ హౌస్ ఎడిటర్ ఆనందా చారి, సంస్థ సిబ్బంది పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కొటేశ్వర రావు మాట్లాడుతూ..ఆప్యాయతతో అందర్నీ కలుపుకొని ఉద్యమంలో ముందుకు సాగారని, ప్రజల సంక్షేమానికి నిరంతరం శ్రమించారని కొనియాడారు. క్షేత్రస్థాయిలో కార్మికులతో కలిసి పని చేశారని, ఉన్నత కుటుంబంలో పుట్టినా శ్రామికుల పక్షాల నిలబడి, వారి సమస్యల సాధన కోసం పోరాటం నడిపించారని తెలియజేశారు. వర్గ దృక్పథంతో పని చేశారని, కష్టాజీవుల తరుపున గళమెత్తారు. సామాజిక రుగ్ముతలపై, కుల నిర్మూలన పోరాటాలకు దిక్సూచిగా వ్యవహరించారని కొనియాడారు.
గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో 1923 సెప్టెంబరు 24న జన్మించిన కొరటాల 2006 జూలై ఒకటిన అనారోగ్యంతో మరణించారు. పూవు పుట్టగానే పరిమలస్తుందన్నట్లుగా అనుచితమైన డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా హైస్కూలులో జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించారు. తెలంగాణా సాయుధ పోరాట సమయంలోనూ, తరువాత 1975లో విధించిన అత్యవసర పరిస్థితిలో నాలుగేండ్లపాటు అజ్ఞాతవాసంలో ఉన్నారు. రైతు సంఘ రాష్ట్రనేతగానే కాదు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకునిగా కూడా ఆయన పనిచేశారు. ఎనభయ్యవ దశకంలో ప్రవేశించిన వ్యవసాయ పనుల కాంట్రాక్టు విధానం కార్మికులకు ఎలా నష్టదాయకమో కూడా ఆయన అధ్యయనం చేసి హెచ్చరించారు.



