నవతెలంగాణ ఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. గతేడాది పహల్గామ్లో ఉగ్ర దాడులకు కారణమైన వారిని ట్రంప్ కొనియాడటమేంటని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించింది.
అఫ్గానిస్థాన్‌తో యుద్ధంలో పాకిస్థాన్‌కు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా మద్దతు పలకడం భారత విదేశాంగ విధానానికి ఎదురుదెబ్బ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించిన ఆయన.. ఇప్పటికే అమెరికాతో మన ఆర్థిక దౌత్యం పూర్తిగా విఫలమైందన్నారు. వాణిజ్య ఒప్పందం తర్వాత కూడా భారత్ నుంచి దిగుమతి చేసుకొనే సోలార్ మాడ్యూల్స్‌పై ట్రంప్ భారీ సుంకాలు విధించిన విషయాన్ని గుర్తుచేశారు. మన వ్యూహాత్మక దౌత్యానికి అధ్యక్షుడు ట్రంప్ పదేపదే అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు.



