నవతెలంగాణ – అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి వారి విధుల నిర్వహణపై ఆరా తీశారు. సిబ్బంది ఎన్ని షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారో తెలుసుకున్నారు.
అనంతరం ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించిన కలెక్టర్, ప్రసూతి వార్డులో చికిత్స పొందుతున్న మహిళలకు అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ వార్డును సందర్శించి మూడు షిఫ్టుల్లో సేవలు అందిస్తున్నట్లు వైద్యులు వివరించారు. జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవల నాణ్యత, మందుల లభ్యత, వైద్యులు, సిబ్బంది స్పందనపై అభిప్రాయాలు సేకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించడం వైద్యులు, సిబ్బంది బాధ్యత అని అన్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం అశ్వారావుపేట దళిత,గిరిజన బాలుర వసతి గృహాలను తనిఖీ చేసిన కలెక్టర్, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించాలని వార్డెన్‌కు సూచించారు. వసతి గృహంలో పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
వసతి గృహ భవనం పైకప్పు నుంచి వర్షపు నీరు లీకేజీ అవుతున్న విషయాన్ని గమనించిన కలెక్టర్, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణంలో వసతి కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలను తక్షణమే చేపట్టాలని సూచించారు. ఆయన వెంట తహశీల్దార్ దాసరి కిశోర్,ఏహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణీ, వసతి గృహాల వార్డెన్ లు నవీన్, క్రిష్ణ లు ఉన్నారు.



