దమ్ముంటే తేదీ, స్థలం, సమయం చెప్పు
సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ప్రతిసవాల్
ప్రభుత్వ వైఫల్యాలు నిరూపించకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
అబద్ధాలు ఆపి
ఇకనైనా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలు, రైతన్నల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వంటి ఏ అంశంపైనైనా ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దమ్ముంటే తేదీ, స్థలం, సమయం చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన ప్రతిసవాల్ విసిరారు. వరంగల్, హైదరాబాద్‌లో అసెంబ్లీ, బోధి పెవిలియన్, ప్రెస్‌క్లబ్, అశోక్‌నగర్ చౌరస్తా ఎక్కడికైనా తానే స్వయంగా వస్తానని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనపైనా, రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా నిరూపించడంలో తాను విఫలమైతే అక్కడికక్కడే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల దోపిడీ వల్లే తెలంగాణ దివాలా తీస్తున్నదని విమర్శించారు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదంటున్న రేవంత్ రెడ్డి, 72 సార్లు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు.
కేసీఆర్ హయాంలో అప్పుల గురించి రేవంత్ రెడ్డి నిత్యం అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2023 వరకు తెలంగాణ అప్పు రూ.3.50 లక్షల కోట్లని పార్లమెంటులో కేంద్రం చెప్పిందన్నారు. ఇందులో ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన అప్పు రూ.72 వేల కోట్లు, కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.2.78 లక్షల కోట్లని వివరించారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి రూ. 8.11 లక్షల కోట్లు అప్పు చేశారంటూ నిత్యం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అప్పులే కాకుండా రాష్ట్ర ఆదాయంతోపాటు అప్పులకు కడుతున్న వడ్డీ లెక్కలపైనా సీఎం తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం చెప్పింది నమ్మాలా?, కాగ్ చెప్పింది నమ్మాలా?అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికే రూ.1.13 లక్షల కోట్లు ఎగ్గొట్టారని ఎద్దేవా చేశారు. రైతు బంధు ఇవ్వకుండా, సంపూర్ణ రుణమాఫీ చేయకుండా, కౌలు రైతులకు, రైతు కూలీలకు చెప్పిన ఆర్థిక సహాయం చేయలేదన్నారు. రైతాంగానికి బాకీ పడ్డ రూ.1.13 లక్షల కోట్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఎకరానికీ రైతుభరోసా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారని అన్నారు. రైతాంగానికి, విద్యార్థులకు, మహిళలకు, రిటైర్డ్ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించడానికి డబ్బులు లేవు కానీ రాహుల్ గాంధీకి మాత్రం రూ.వెయ్యి కోట్లు ఇస్తానంటూ రేవంత్‌రెడ్డి చెప్తున్నారని తెలిపారు.
ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. డబ్బుల్లేవంటూనే రూ.200 కోట్లతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించుకున్నారని అన్నారు. యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అబద్ధాలు మాట్లాడ్డం ఆపి ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెట్టాలని హితవు పలికారు. రాష్ట్రం గురించి అడ్డగోలుగా మాట్లాడి ప్రజల ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని కోరారు. రానున్న రోజుల్లో బాహుబలి సినిమాలో భల్లాల దేవునికి పట్టిన గతే రేవంత్‌రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. ఆయన నమ్మిన హిట్లర్‌కి ఎలాంటి ముగింపు కలిగిందో అలాంటి ముగింపునే ప్రజలు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి ఇస్తారని అన్నారు. ఆయన అభద్రతాభావంలో ఉన్నారని చెప్పారు. రూ.15 లక్షలు ఇస్తానని మోడీ, రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు ఇస్తానని రేవంత్‌రెడ్డి మోసం చేశారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి జలాలను గురుదక్షిణ కింద చంద్రబాబుకు అప్పగించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 280 ఎకరాల భూమిని కొల్లగొట్టేందుకు ప్రభుత్వం మెట్రో రైల్‌ను స్వాధీనం చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి, విప్ కెపి వివేకానంద, మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షులు తుంగబాలు, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ రాకేశ్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.



