Thursday, July 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు‌ఇందిరమ్మ జీవిత బీమా ఏదీ?

‌ఇందిరమ్మ జీవిత బీమా ఏదీ?

- Advertisement -

నామినీల పేర్లూ సేకరించలే..
కొత్త ఆసరా పించన్లూ లేవు
1.44 లక్ష‍ల మంది విద్యార్థులకే అల్పాహారం
జూన్‌ 2 గడిచి నెలైనా …
ఇంకా గడపతొక్కని కొత్త పథకాలు
నేటి క్యాబినెట్‌‌లో చర్చకు వచ్చేనా?

రాష్ట్రంలో కొత్త సంక్ష‍ేమ పథకాలను రాష్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌‌ రెండో తేదీ నుంచి అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఘడియ దాటిపోయి నెలరోజులైంది. ప్రభుత్వం చెప్పిన కొత్త పథకాలు ఏవీ ఇంకా పట్టాలెక్కలేదు. అసలు ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకుంటున్న దాఖలాలూ కనిపించట్లేదు. గతంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లోనే అమల్లోకి రాని గ్యారెంటీలు ఇంకా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం రైతు భరోసా చెల్లింపులు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పట్లో పాత, కొత్త పథకాలేవీ పట్టాలెక్కే అవకాశాలు కనిపించట్లేదు.

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.ఐదు లక్ష‍ల చొప్పున ఇందిరమ్మ జీవిత బీమాను అమలు చేస్తామని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. జూన్‌ ‌2 నాటి రాష్ర్టావతరణ వేడుకల్లో సీఎం రేవంత్‌‌రెడ్డి ఈ పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు. దానికోసం రూ.4 వేల కోట్లు కేటాయించామనీ, ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఏదైనా అనుకోని ప్రమాదాల్లో కుటుంబ యజమానికి ప్రాణనష్టం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా నామినీకి రూ.ఐదు లక్ష‍ల బీమా సొమ్మును వారం, పది రోజుల్లో అందిస్తామని తెలిపారు. కానీ ఇప్పటి వరకు కుటుంబాల వివరాలు, ఇన్సూరెన్స్‌ ‌కంపెనీలతో ఒప్పంద ప్రక్రియ జరగలేదు. తెల్ల రేషన్‌‌కార్డుల్ని ప్రామాణికంగా తీసుకొని ఈ బీమాను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నామినీల పేర్లను ఇప్పటి వరకు సేకరించలేదు.

‘ఆసరా’ ‌కోసం నిరీక్ష‍ణ
రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల కోసం కొత్త లబ్దిదారులు ఎంతో కాలంగా నిరీక్ష‍ిస్తున్నారు. జూన్‌ ‌రెండో తేదీ నుంచి రెండు లక్ష‍ల మంది కొత్త లబ్దిదారులకు చేయూత పథకం పేరుతో ఆసరా పెన్షన్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నెలదాటినా ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ‘ఆసరా’ కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కానీ అర్హుల జాబితాను ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో కొత్తగా ఈ పించన్ల పరిధిలోకి వస్తున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎదురుచూపులు చూడక తప్పట్లేదు. ప్రభుత్వ జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జూన్‌ ‌నెలకు సంబంధించిన ఆసరా పించన్లను ప్రాంతాల వారీ దశలవారీ చెల్లిస్తున్నారని, లబ్దిదారులకు సకాలంలో వట్లేదని ప్రతిపక్ష‍ాలు ఆరోపిస్తున్నాయి. ఈ నిధుల్ని రైతు భరోసాకు మళ్లించారని విమర్శలు చేస్తున్నారు.

టిఫిన్‌ ‌పెట్టట్లే…
రాష్ట్రంలో ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్‌ ‌విద్య వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి బడ్జెట్‌‌లో రూ.800 కోట్లు కేటాయించింది. ఇంటర్‌ ‌విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి ఏ రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు. దానికోసం రూ.వంద కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కానీ ఇప్పటి వరకు 1,269 పాఠశాలలు, 33 కాలేజీలు కలిపి మొత్తం 1,302 ప్రభుత్వ విద్యాసంస్థల్లోని 1,44,610 మంది విద్యార్థులకే అల్పాహారం అందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ ‌స్కూళ్లు, కేజీబీవీలు, ప్రభుత్వ జూనియర్‌ ‌కాలేజీల్లో కలిపి సుమారు 22 లక్ష‍ల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఇంకా 20.5 లక్ష‍ల మంది విద్యార్థులకు టిఫిన్లు అందట్లేదు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలుంటే, ప్రస్తుత విద్యాసంవత్సరంలో 2,769 బడుల్లోనే ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించారు. గతేడాది 1,362 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించగా, ఈ ఏడాది అదనంగా మరో 1,407 బడుల్లో దీన్ని అమల్లోకి తెచ్చారు.

ఉద్యోగులకు ఉపశమనం
రాష్ట్రంలోని ఉద్యోగులకు మాత్రం ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించింది. ఉద్యోగులకు రూ.1.20 కోట్ల ఉచిత ప్రమాదబీమాకు సంబంధించిన ఒప్పందాన్ని 16 బ్యాంకులతో ప్రభుత్వం చేసుకుంది. విమాన ప్రమాదం సంభవిస్తే రూ.రెండు కోట్ల నుంచి రూ.మూడు కోట్ల వరకు పరిహారం అందనుంది. మరోవైపు ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకం (ఈహెచ్‌‌సీటీ)ని ఏర్పాటు చేసింది. ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకాన్ని ఈనెల 15 నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ ‌బెనిఫిట్ల కోసం రెండు నెలలుగా నెలకు రూ.రెండు వేల కోట్లు విడుదల చేస్తున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉద్యోగులకు కొంత ఊరట కలిగిస్తున్నాయని ఉద్యోగ సంఘ నాయకులు చెప్తున్నారు.

అన్నింటికీ ఆర్థిక సమస్యలే…
సంక్ష‍ేమ పథకాల అమలుకు రాష్ర్ట ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు అడ్డొస్తున్నాయి. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తాహతుకు మించి రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని సీఎం రేవంత్‌‌రెడ్డి అనేక వేదికలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సంక్ష‍ేమ పథకాలు అమలు చేయాలని ఎంత ప్రయత్నిస్తున్నా, బీఆర్‌ఎస్‌ ‌పదేండ్ల పాలనలో చేసిన రూ.7 లక్ష‍ల కోట్ల అప్పులకు అసలు, వడ్డీలు కట్టడానికే ఖజానాలో సొమ్ము సరిపోతున్నదని చెప్తున్నారు. అయినా పరిస్థితుల్ని సరిదిద్దుకుంటూనే సంక్ష‍ేమానికి ప్రాధాన్యత ఇస్తూనే, ‘టాక్స్‌‌పేయర్స్‌’ లూప్‌‌హోల్స్‌‌ను కట్టడి చేయమని ఆధికారుల్ని ఆదేశిస్తున్నారు. ఖజానాలో సొమ్ము పెరిగితే, సంక్ష‍ేమం మరింత వేగంగా అమలు చేస్తామని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు.

​పెండింగ్‌‌లోనే ‘గ్యారంటీలు’

రాష్ట్రంలో ఆరుగ్యారంటీలు పూర్తిగా అమల్లోకి రాలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో వీటిని ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా పూర్తిస్థాయి అమలుకు నోచుకోలేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.ఐదు లక్ష‍ల నుంచి రూ.పది లక్ష‍ల వరకు పెంచడం వంటివి అమలవుతున్నాయి. రూ.500లకే గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌కూడా కొంతమేరకే అమలవుతున్నది. ఈ స్కీం అమలుకు కేంద్రం వేస్తున్న కొర్రీలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కేవైసీ పేరుతో కనెక్ష‍న్ల సంఖ్యను కుదించే ప్రయత్నం చేస్తున్నారు. డొమెస్టిక్‌ సిలిండర్ల ‌ధరను పెంచేసి, డెలీవరిపైనా ఆంక్ష‍లు విధించారు. దీనితో సహజంగానే రాష్ర్ట ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో జమచేస్తున్న సొమ్ము గణనీయంగా తగ్గుతూ వస్తున్నది. అనేకమంది లబ్దిదారులు తమకు రాష్ర్ట ప్రభుత్వ సబ్సిడీ రావట్లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపు సబ్సిడీని ఎత్తేసింది. కేవలం కొందరు వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో మాత్రమే రూ.61 మాత్రమే జమ చేస్తున్నది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి విడతలో నాలుగు లక్ష‍ల ఇండ్లు, రెండో విడతలో 2.5 లక్ష‍ల ఇండ్లను మంజూరు చేసింది. ఇప్పటి వరకు లక్ష‍ ఇండ్ల నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. కానీ మహాలక్ష్మి పథకంలో ఇంకా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అమలు కాలేదు. యువ వికాసం కింద విద్యార్థులకు రూ.ఐదు లక్ష‍ల విద్యా భరోసా కార్డును ఇంకా ఇవ్వలేదు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వడం లేదు. కౌలు రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు సైతం ఇవ్వకుండా ప్రభుత్వం విస్మరించింది. చేయూత పథకం కింద పెన్షన్‌‌ను రూ.నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అదీ ఇంకా అమల్లోకి రాలేదు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -