Thursday, July 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసర్‌తో సందిగ్ధంలో 
పేదల ఓట్లు

సర్‌తో సందిగ్ధంలో 
పేదల ఓట్లు

- Advertisement -

ఎన్ఆర్ ఈజీఎస్‌‌ను పునరుద్ధరించాలి
భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినందుకే సామినేని హత్య
8 నెలలైనా హంతకులను పట్టుకోకపోవటం సీఎం, డిప్యూటీ సీఎంలకు సిగ్గు చేటు :
రామారావు విగ్రహావిష్కరణ సభలో సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నాయకులు బృందాకరత్

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ చింతకాని/బోనకల్
​ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తో పేదల ఓట్లు సందిగ్ధంలో పడ్డాయని సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నాయకులు బృందాకరత్ అన్నారు. సర్‌‌పై విచారణ చేపట్టాలని సీపీఐ(ఎం) 23 పార్టీలతో కలిసి సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించి తీరాలని పిలుపునిచ్చారు. జులై 1 నుంచి రద్దయిన ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించి దాని స్థానంలో ఏర్పాటు చేసిన వీబీ గ్రామ్‌ ‌జీ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. సామినేని రామారావు కేసులో ఎనిమిది నెలలైనా హంతకులను పట్టుకోకపోవటం సీఎం రేవంత్‌‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కలకు అవమాన కరమని అన్నారు. సామినేని హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో బుధవారం ఆ గ్రామ మాజీ సర్పంచ్ సామినేని రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముందుగా వందలాది మందితో గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సామినేని విగ్రహాన్ని బృందాకరత్ ఆవిష్కరించారు. రామారావుకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బృందాకరత్‌ మాట్లాడుతూ ​సామినేని రామారావు సతీమణి స్వరాజ్యానికి సెల్యూట్ ‌చేశారు. ఇతరులు భూములను లాగేసుకుంటుంటే సామినేని తన భూమిని పేదలకు ఇచ్చిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. భూస్వాములకు వ్యతిరేకంగా పేదల కోసం పోరాడినందునే సామినేనిని హత్య చేశారన్నారు. సామినేని నాయకత్వంలో ఎర్రజెండా పోరాటాలను చూడలేక, ఆయనకు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేకే కాంగ్రెస్ పార్టీ నాయకులు హత్య చేశారని ఆరోపించారు. ఆయన హత్య జరిగి ఎనిమిది నెలలు గడిచినా హంతకుల్లో ఒక్కర్నీ అరెస్టు చేయలేక పోయారన్నారు. భట్టి ఉపముఖ్యమంత్రి కాదా? ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కాదా? అని ప్రశ్నించారు. హెూంమినిస్టర్ కూడా అయిన రేవంత్ రెడ్డి ఏమి చేస్తున్నారని అడిగారు. హంతకులను పట్టుకునే వరకూ పోరాటం సాగుతుందన్నారు.

మోడీ దృష్టిలో రోజుకు రూ. 57. సంపాదిస్తే పేదవాళ్లు కాదట
పేదలు, శ్రామికులు, రైతులు, ఆదివాసీలు, విద్యార్థులు, స్త్రీల హక్కులు హరించివేయబడుతున్న సమాజంలో ఉన్నామని బృందాకరత్‌ అన్నారు. జులై 1న ‘ఉపాధి హామీ’ ప్రోగ్రాంను నాశనం చేశారన్నారు. కార్మికులు, శ్రామికుల హక్కులు పూర్తిగా తుడిచివేస్తూ వీబీ ‌గ్రామ్‌ జీ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ స్కీం గురించి అడిగితే పేదలు లేరు, డబ్బులు లేవని అంటున్నారని చెప్పారు. రోజుకు రూ.57 కన్నా తక్కువ సంపాదిస్తే మోడీ దృష్టిలో పేదవారు కాదట..! అని తెలిపారు. రూ.57తో అరలీటర్ వంటనూనె కూడా రాదన్నారు. వెంటనే వీబీ గ్రామ్‌ ‌జీ చట్టాన్ని రద్దు చేయాలని తిరిగి ఎన్ఆర్ఈజీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టుల పోరాటాలను ఎదుర్కోలేకే బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుంటుందని అన్నారు. అయోధ్య రామమందిరం ట్రస్టు నిర్వాహకులు భక్తులు ఇచ్చిన కానుకలు రూ. 200 కోట్లు నొక్కివేశారని, ‘జై శ్రీరామ్… జై శ్రీరామ్’ అంటూనే దోచేశారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రే ట్రస్టు డబ్బులను దోచుకున్న వారిని కాపాడుతుందటం సిగ్గు చేటన్నారు.

సర్‌‌పై విచారణ చేపట్టాలి
సర్ పేరుతో ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని బృందాకారత్ తెలిపారు. పేదల ఓట్లే అనుమానాస్పందంగా మారాయన్నారు. సర్‌‌పై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. స‌ర్‌‌పై తమ యుద్ధం బీజేపీతోనేనని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లను పెట్టి పేదల ఇండ్లను కూల్చివేస్తోందన్నారు. పక్షికి కూడా చెట్టుపై గూడు నిర్మించుకునే హక్కు ఉంటుందని తెలిపారు. ఎవరికైతే కనీసం నీడలేదో.. ఆ నీడలేని శ్రామికులు గూడు కట్టుకుంటే కూల్చివేయటం సిగ్గుచేటన్నారు. కూల్చివేతలను ఆపి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

హంతకులను పట్టుకోలేని అసమర్థ ప్రభుత్వం : పోతినేని
సామినేని రామారావు హంతకులును 8 నెలలైనా పట్టుకోలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డికి ఇది సిగ్గుచేటుగా లేదా అని ప్రశ్నించారు. రామారావు కేసును పక్కదోవ పట్టించే పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు సాయిబాబు, జ్యోతి, మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వర్లు, వై. విక్రమ్, బండి పద్మ, సీనియర్ నాయకులు పి.సోమయ్య, పొన్నం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -