– కుటుంబ సభ్యుల సమక్షంలో పదవీ విరమణ కార్యక్రమం
– శాలువా, పూలమాలతో సత్కరించిన జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర,
నవతెలంగాణ – కామారెడ్డి
పోలీసు శాఖలో దశాబ్దాల పాటు నిస్వార్థ సేవలు అందించి పదవీ విరమణ పొందుతున్న అధికారుల సేవలు అమూల్యమైనవని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై డి. శ్రీరామ్, కలెక్టర్ కార్యాలయం ఎస్సై డి. ఉదయ్ శేకర్‌ల పదవీ విరమణ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు పదవీ విరమణ పొందుతున్న అధికారులను, వారి సతీమణులను శాలువాలు, పూలమాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. పోలీసు విధుల్లో కుటుంబాలకు దూరంగా ఉండి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల రక్షణ కోసం కృషి చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో వీరి సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ఎస్సైలు డి. శ్రీరామ్, డి. ఉదయ్ శేకర్‌లు 1989లో పోలీసు కానిస్టేబుళ్లుగా సేవలు ప్రారంభించి సుమారు 37 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో ఉత్తమ సేవలు అందించారు.
వారి సుదీర్ఘ సేవా ప్రస్థానం నిబద్ధత, అంకితభావానికి నిదర్శనమని ఎస్పీ కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా విధులు నిర్వర్తించి శాఖలో తమదైన ముద్ర వేశారని అన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ఆనందంగా శేష జీవితం గడపాలని ఎస్పీ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ మధుసూదన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సంతోష్, కృష్ణ, పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొని అధికారులకు కరతాళధ్వనుల మధ్య సాదరంగా వీడ్కోలు పలికారు.



