Thursday, July 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహనుమకొండ డీఎంహెచ్‌ఓపై ఉద్యోగ సంఘాల కన్నెర్ర

హనుమకొండ డీఎంహెచ్‌ఓపై ఉద్యోగ సంఘాల కన్నెర్ర

- Advertisement -

‘డాక్టర్స్ డే’ బహిష్కరణ.. ఎమ్మెల్యే, కలెక్టర్‌కు ఫిర్యాదు
మంత్రి వద్దకు చేరిన పంచాయితీ
బదిలీ చేయకపోతే నిరవధిక సమ్మె
తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదానాయక్
పనిచేయమన్నందుకే.. 
: డాక్టర్ రామ్‌కుమార్, డీఎంహెచఓ

నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హనుమకొండ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్‌డీ రామ్‌ కుమార్ అనుచితంగా ప్రవర్తించడంతోపాటు వ్యక్తిగత దూషణలకు దిగారని వైద్యారోగ్య శాఖ ఉద్యోగ సంఘాలు, టీఎన్జీవో, టీజీఓ, డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఈ మేరకు హనుమకొండ కలెక్టరేట్‌లో జరగాల్సిన ‘డాక్టర్స్ డే’ కార్యక్రమాన్ని వైద్యులు, సిబ్బంది బహిష్కరించారు. జూన్ 6వ తేదీన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్‌డీ రామ్‌ కుమార్ ద్వంద్వర్ధాలతో మహిళా వైద్యులు, సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సంఘాలు, వైద్యులు, సిబ్బంది మొదట వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే ఎమ్మెల్యే వైద్య, ఆరోగ్య శా‌ఖ మంత్రికి ఫోన్‌లో పరిస్థితిని వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయిని కలిసి ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు ఆవేదనకు గురిచేస్తున్నాయని కలెక్టర్‌కు వివరించారు. ఈ క్రమంలో కలెక్టర్.. మహిళా వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మహిళా డాక్టర్ల ఆవేదనను సావధానంగా కలెక్టర్ ఆలకించారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌తో మాట్లాడుతానని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు యూనియన్ నేతలు తెలిపారు. డాక్టర్స్ డే కార్యక్రమం ఉంది కదా అని కలెక్టర్ గుర్తు చేయగా డాక్టర్స్ డే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు వారు చెప్పారు.

బదిలీ చేయకపోతే నిరవధిక సమ్మె : యాదానాయక్
ఆశా వర్కర్ల నుంచి అడిషనల్ డీఎంహెచ్‌ఓ వరకు వైద్యులు, సిబ్బందిని ద్వంద్వర్ధాలతో వ్యక్తిత్వ దూషణలు చేస్తూ ఇబ్బంది పెడుతున్న హనుమకొండ జిల్లా వైద్యారోగ్య శా‌ఖ అధికారి డాక్టర్ ఎస్‌డీ రామ్‌కుమార్‌ను వెంటనే బదిలీ చేయాలని, లేనిపక్షంలో నిరవధిక సమ్మె చేస్తామని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదానాయక్ హెచ్చరించారు. కారుణ్య నియామకాలపై వెటకారంగా మాట్లాడారన్నారు. కారుణ్య నియామకాల్లో నియమితులైన వారెందరున్నారని అడిగి మరీ ‘మీ తల్లిదండ్రులను చంపుకొని ఉద్యోగాలు పొందారు.. మీకు చదువు రాదు’ అని కించపరుస్తూ వ్యాఖ్యానించారన్నారు. ఒక జూనియర్ అసిస్టెంట్‌ను ‘ఇప్పటి వరకు ఎందుకు పెండ్లి చేసుకోలేదు.. అని ప్రశ్నించి, ఇప్పటి నుంచి నీ పెళ్లాన్ని’ అంటూ వ్యాఖ్యానించి అందరి ముందు అవమానపరిచారన్నారు. జూమ్ మీటింగ్‌లో 9 నెలల గర్భవతిగా ఉన్న ఒక మహిళా డాక్టర్‌నుద్దేశించి ఇంత డల్‌గా ఉంటే, నీ భర్త ఎలా చూసుకుంటడు.. అని వ్యాఖ్యానించారని, దీంతో ఆ డాక్టర్ తీవ్ర మానసిక వ్యధకు గురైందన్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామన్నారు.

పనిచేయమన్నందుకే
: డాక్టర్ రామ్‌కుమార్, డీఎంహెచ్‌ఓ
పని చేయమన్నందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారని డీఎంహెచ్‌ఓ రామ్‌కుమార్ ‘నవతెలంగాణ’కు వివరణ ఇచ్చారు. కారుణ్య కోటాలో నియమితులైన వారిపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, ఆ మాట అన్నది నిజమే కానీ, మీ కుటుంబంలో జరిగిన దుస్సంఘటనతో మీకు ఉద్యోగాలు వచ్చాయని, మేం ఎంతో కష్టపడి చదివితే ఉద్యోగాలు వచ్చాయని, మీ ఉద్యోగాలు నిలుపుకోవాలని అన్నానే తప్పా తప్పుగా మాట్లాడలేదన్నారు. పెద్దమ్మగడ్డ అర్బన్‌ హెల్త్ సెంటర్‌లో ఉద్యోగులు 7 రోజులుగా రాకపోవడంతో మెమోలు ఇచ్చానన్నారు. పనిలో భాగంగానే ప్రశ్నించడం తప్ప ఎవరిపైనా వ్యక్తిగతంగా దూషణలకు దిగలేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -