10.68 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1590.02
కోట్లు జమ
మూడెకరాలు ఉన్న రైతులకు లబ్ది
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వానాకాలం రైతు భరోసా రెండో విడత నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. రెండు ఎకరాల నుంచి మూడెకరాల వరకు భూమి కలిగి ఉన్న 10.68 లక్షల రైతుల ఖాతాల్లో రాష్ట్ర సర్కారు రూ.1,590.02 కోట్లు జమ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో రూ.2,482 కోట్ల నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండ్రోజుల వ్యవధిలో 32 జిల్లాలకు చెందిన 54,95,742 మంది రైతుల ఖాతాలో మొత్తంగా రూ.4072.04 కోట్లు జమ చేసినట్టు అయ్యింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాకు చెందిన 4,06,875 మంది రైతులు రూ.314.91 కోట్లను లబ్ది పొందారు. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో(హైదరాబాద్ జిల్లాను మినహాయించగా) 20,971 మంది రైతుల ఖాతాలో రూ.11.20 కోట్లు జమయ్యాయి.
రైతులకు ఇబ్బంది కలుగకుండా
విడతల వారీగా జమ : మంత్రి తుమ్మల
వానాకాలం పంటల సాగు మొదలైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా విడతల వారీగా రైతుభరోసా నిధులను విడుదల చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం మొదటి దశలో రెండెకరాల వరకు భూమున్న 44.27 లక్షల మంది రైతులకు రూ.2482.02 కోట్లు, బుధవారం రెండు నుంచి మూడెకరాల వరకు భూమి కలిగి 10.68 లక్షల రైతుల ఖాతాల్లో 1,590 కోట్ల జమ చేశామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా పథకాన్ని తప్పనిసరిగా అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు.
అత్యధికంగా లబ్ది పొందిన జిల్లాలు
జిల్లా రైతులసంఖ్య అమౌంట్
- నల్లగొండ 4,06,875 రూ.314.91 కోట్లు
- సంగారెడ్డి 2,91,800 రూ.198.88 కోట్లు
- ఖమ్మం 2,71,027 రూ.198.17 కోట్లు
- సిద్దిపేట 2,66,722 రూ.186.89 కోట్లు
- కామారెడ్డి 2,59,093 రూ.173.81 కోట్లు
అత్యల్పంగా లబ్ది పొందిన జిల్లాలు
జిల్లా రైతులసంఖ్య అమౌంట్
- మేడ్చల్ మల్కాజరిగిరి 20,971 రూ.11.20 కోట్లు
- ములుగు 64,030 రూ.49.87 కోట్లు
- కొమ్రంభీమ్‌అసిఫాబాద్ 81,448 రూ.75.72 కోట్లు
- ఆదిలాబాద్ 87,419 రూ.95.64 కోట్లు
- జయశంకర్‌భూపాలపల్లి 93,768 రూ.73.68 కోట్లు



