Thursday, July 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసిద్దిపేట జిల్లాలో 6 వేల యూరియా బస్తాలు మాయం

సిద్దిపేట జిల్లాలో 6 వేల యూరియా బస్తాలు మాయం

- Advertisement -

యాప్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన అక్రమాలు
డీలర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు, అరెస్టు
వ్యవసాయ అధికారిని కూడా సస్పెండ్‌ చేశాం
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు 
: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సిద్దిపేట జిల్లాలో ఆరు వేల యూరియా బస్తాలు మాయమయ్యానే విషయాన్ని ఫర్టిలైజర్ యాప్ ద్వారా గుర్తించామనీ, ఇద్దరు హోల్‌‌సేల్‌ ‌డీలర్లు, ఒక రిటైలర్‌ ‌లైసెన్స్‌‌ను రద్దు చేయడంతో పాటు అరెస్టు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విషయంలో వ్యవసాయ అధికారిని కూడా సస్పెండ్‌ ‌చేసినట్టు వెల్లడించారు. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నమోదవుతున్నందున తప్పుడు ఎంట్రీలు, కల్పిత బిల్లులు, అక్రమ నిల్వలు, యూరియా మళ్లింపులను సులభంగా గుర్తించామని తెలిపారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో, ఒక సొసైటీ పరిధిలో ఎరువుల సరఫరాలో జరిగిన అక్రమాలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ యూరియా అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదనీ, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం యూరియా యాప్‌ను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల అక్రమదారులకు అన్ని మార్గాలు మూసుకుపోయాయని తెలిపారు.

గతంలో కొందరు అక్రమంగా ప్రయివేటు సంస్థలకు యూరియాను విక్రయించి రైతులను మోసం చేసే పరిస్థితులు ఉండేవనీ, ఇప్పుడు అలాంటి అవకాశాలకు పూర్తిగా అడ్డుకట్ట పడిందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటివరకూ రాష్ట్రానికి రావాల్సిన ఆరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 5.62 మెట్రిక్ టన్నులను రాష్ట్రానికి తెప్పించగలిగామనీ, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చి, రాష్ట్రానికి అవసరమైన యూరియాను సకాలంలో అందుబాటులోకి తీసుకురాగలిగామని వివరించారు. యూరియా యాప్‌పై కొందరు అసత్య ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ఇప్పటివరకు యూరియా యాప్ ద్వారా 52.30 లక్షల బస్తాల యూరియాను రైతులు బుక్ చేసుకోగా, అందులో 46.03 లక్షల బస్తాలను కొనుగోలు చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 79.29 లక్షల బస్తాల యూరియా అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనీ, ఎరువుల సరఫరా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమశిక్షణను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -