Thursday, July 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేవంత్‌రెడ్డి రూపంలో 'ఎల్‌నినో' కరువు!

రేవంత్‌రెడ్డి రూపంలో ‘ఎల్‌నినో’ కరువు!

- Advertisement -

​రెండు పిల్లర్ల సాకుతో కాళేశ్వరం నీరు ఆపారు
కేసీఆర్‌ దేవుడైతే.. సీఎం రేవంత్‌ రెడ్డి ‘బూతుపతి’..
ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
​ప్రకృతి ఎల్‌నినో ప్రభావంతో కరువు తెస్తే.. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి రూపంలో మరో పెద్ద ‘ఎల్‌నినో’ కరువు వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక రాష్ట్రంలో కరువు ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కరువు పరిస్థితులను ముందే ఊహించి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. ‘కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటే కాదు. ఎన్నో డ్యామ్‌లు, సొరంగాలు, ఎత్తిపోతల పథకాల సమాహారం. మేడిగడ్డలో 88 పిల్లర్లలో రెండు పిల్లర్లు మాత్రమే దెబ్బతింటే, మరమ్మతులు చేయకుండా కాళేశ్వరమే కూలిపోయిందంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎగువ నుంచి ప్రస్తుతం 10 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. మరో పది రోజుల్లో లక్ష నుంచి రెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైనా కన్నెపల్లి పంప్‌హౌస్‌ ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవచ్చు. కానీ, నీళ్లు ఎత్తిపోస్తే ఎక్కడ కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందోననే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనులు చేయడం లేదు’ అని విమర్శించారు.
కేసీఆర్‌ను ‘పశుపతి’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. నేపాల్‌లోని పశుపతినాథ్‌ను హిందువులంతా ఆరాధ్య దైవంగా కొలుస్తారని అని వివరించారు. ‘తెలంగాణలో రైతులను, పాడి పశువులను, ప్రజలను కంటికి రెప్పలా కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన కేసీఆర్‌ నిజంగానే రైతుల పాలిట దేవుడు (పశుపతి)’ అని చెప్పారు. మరి నోరు తెరిస్తే బూతులు మాట్లాడే రేవంత్‌రెడ్డి ఏంటి.. ‘బూతుపతి’ నా? అని ప్రశ్నించారు.

వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే!
అధికారం ఎవరికీ శాశ్వతం కాదంటూ ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ను ఉదాహరణగా రేవంత్‌రెడ్డి ప్రస్తావించడాన్ని బట్టి చూస్తే ఆయనకు తన భవిష్యత్‌ ఏంటో అర్థమైపోయిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తాను కూడా త్వరలోనే గద్దె దిగిపోతానని రేవంత్‌రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నారని, వచ్చేది మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆయన మాటల్లోనే తేలిపోయిందని అన్నారు. కనీసం రైతు భరోసా ఇవ్వలేని ఈ ప్రభుత్వాన్ని రైతులు కాగడాలు పట్టుకుని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -