Thursday, July 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతీవ్ర సంక్షోభంలో విద్యా వ్యవస్థ

తీవ్ర సంక్షోభంలో విద్యా వ్యవస్థ

- Advertisement -

జులై 10న విద్యా సంస్థల బంద్ ను జయప్రదం చేయాలి
విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలు
వామపక్ష విద్యార్థి సంఘాలు.. ‌
వాల్‌‌ పోస్టర్‌ ఆవిష్కరణ


నవతెలంగాణ-హిమాయత్ నగర్

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కొరత, మౌలిక వసతులు లేవని వామపక్ష‍ విద్యార్థి సంఘాల (ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ) రాష్ట్ర కమిటీలు ఆవేదన వ్యక్తం చేశాయి. హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు ఉన్నాయని, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీ, విద్యార్థుల భద్రత వంటి అనేక సమస్యలు పేరుకుపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని విమర్శించాయి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జులై 10న కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్‌ ‌చేపట్టనున్నట్టు ప్రకటించాయి. ఈ బంద్‌‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రజలు, తల్లిదండ్రులు, మేధావులు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. బం‌ద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్లను బుధవారం హైదరాబాద్‌ హిమాయత్ నగర్ ముఖ్ధూం భవన్‌లో వామపక్ష విద్యార్ధి సంఘాల ‌నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష‍ ప్రధాన కార్యదర్శులు ఎస్‌.రజనీకాంత్‌, టి.నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని, విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అన్ని విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యార్థినుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టి ప్రతి విద్యా సంస్థలోనూ ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020) అమలును నిలిపివేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ఈ బంద్ ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ ‌నాయకులు కె.మణికంఠరెడ్డి, పుట్టా లక్ష్మణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని, కానీ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం, విద్యార్థుల హక్కులను సాధించుకోవడం కోసం జులై 10న జరిగే విద్యా సంస్థల బంద్‌ను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, కె.అశోక్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పల శాంతి కుమార్, హరీష్, పీడీఎస్‌‌యూ నాయకులు నాగరాజు, ఎస్.అనిల్, ఏఐఎఫ్‌‌డీఎస్‌ పల్లె మురళీ, గడ్డం నాగర్జున, ఏఐడీఎస్‌ఓ నీతీష్, ఏఐపీఎస్‌‌యూ నాయకులు మన్నె కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -