అబుదాబి సంస్థతో భారీ జాయింట్ వెంచర్
వచ్చే మూడేళ్లలో రూ.4700 కోట్ల పెట్టుబడులు
త్వరలో ఇవి కార్ల తయారీలోకి..
ఎంఇఐఎల్ ఎండి పివి కృష్ణారెడ్డి వెల్లడి
నవతెలంగాణ- బిజినెస్ బ్యూరో
మౌలిక సదుపాయాల రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) తాజాగా ఐటి వ్యాపారంలోకి ప్రవేశించింది. దేశంలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను విస్తృత స్థాయిలో అమలు చేయడానికి అబూదాబి కేంద్రంగా పనిచేసే గ్లోబల్ టెక్నాలజీ సంస్థ అనలాగ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. 50:50 నిష్పత్తిలో సంయుక్త సంస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు రాబోయే మూడేళ్లలో 300 నుండి 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,700 కోట్లు) వరకు పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేశామని ఎంఇఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా రోబో డ్రోన్లు, ఫిజికల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి ట్రాఫిక్, భద్రత వంటి పట్టణ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం పరిధిలోని ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్ గ్రిడ్ సామర్థ్యం పెంపు, విద్య, ఆరోగ్య రంగాల్లో పబ్లిక్ సర్వీసులను మెరుగుపరచడం వంటి అంశాలపై ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. యంత్రాలు కేవలం ప్రోగ్రామింగ్కే పరిమితం కాకుండా.. నిరంతర అభ్యాసం ద్వారా వాస్తవ ప్రపంచంలో స్వయంగా అర్థం చేసుకుని పనిచేయడమే ఫిజికల్ ఇంటెలిజెన్స్ అని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ కోసం దీర్ఘకాలిక సామర్థ్యాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో అనాలగ్ సంస్థతో కలిసి పనిచేస్తామని ఆ సంస్థ సిఇఒ అలెక్స్ కిప్మన్ వెల్లడించారు.
త్వరలో ఇవి కార్ల తయారీలోకి..
గతేడాది ఎంఇఐఎల్ గ్రూప్ రూ.55,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని కృష్ణారెడ్డి తెలిపారు. మేఘా ఇంజనీరింగ్ ఇతర వ్యాపార విస్తరణపై కూడా వేగంగా అడుగులు వేస్తోందన్నారు. బ్యాటరీ తయారీ కేంద్రంతో పాటు ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని చేపట్టేందుకు కంపెనీ సిద్ధమవుతోందన్నారు. దీనికి సంబంధించి రాబోయే రెండు మూడు నెలల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. చైనాకు చెందిన బివైడి సంస్థతో భాగస్వామ్యంపై వస్తున్న వార్తలను కృష్ణారెడ్డి ఖండించారు. ప్రస్తుతం తాము ఒక అంతర్జాతీయ కంపెనీతో చర్చలు జరుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మేఘా ఇంజనీరింగ్ వద్ద రూ. 2.5 లక్షల కోట్ల ఆర్డర్ బుక్ ఉందని వెల్లడించారు. రాబోయే నాలుగేళ్లలో వీటిని పూర్తి చేయనున్నామని ఆయన తెలిపారు.
జూన్‌లో జీఎస్టీ వసూళ్లు 14 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జూన్ నెలలో భారీ వృద్ధిని నమోదు చేశాయి. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన నెలలో మొత్తం జిఎస్టి వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 14 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ఈ వసూళ్లలో దేశీయ లావాదేవీల ద్వారా రూ.1.35 లక్షల కోట్లు సమకూరగా, దిగుమతులపై వచ్చిన పన్ను వసూళ్లు ఏకంగా 34.6 శాతం పెరిగి రూ.60 వేల కోట్లకు చేరుకున్నాయి. జూన్ నెలకు సంబంధించి రూ.32,436 కోట్ల రిఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత.. నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లుగా ఉన్నాయి.
తెలంగాణ లో 11 శాతం వృద్ధి..
జూన్ నెలలో తెలుగు రాష్ర్టాలు సానుకూల వృద్ధిని సాధించాయి. తెలంగాణకు స్థూలంగా రూ.5,050 కోట్ల జీఎస్టీ వసూళ్లు రాగా.. గత ఏడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,548 కోట్ల స్థూల వసూళ్లు రాగా.. ఐదు శాతం పెరుగుదల నమోదయ్యింది. పన్ను వాటాల సర్దుబాటు అనంతరం.. తెలంగాణ నికర జీఎస్టీ ఆదాయం రూ.3,994 కోట్లుగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నికర ఆదాయం రూ.3,144 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడించాయి.
ఫిజికల్ ఇంటెలిజెన్స్ లోకి మేఘా ఇంజనీరింగ్
- Advertisement -
- Advertisement -



