Thursday, July 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవైటీడీ బోర్డులో ‘కార్పొరేట్‌’ కూర్పు

వైటీడీ బోర్డులో ‘కార్పొరేట్‌’ కూర్పు

- Advertisement -

ఉమ్మడి నల్లగొండకు మొండిచేయి
ఆలయం జిల్లా పరిధిలోనే.. అయినా దక్కని ప్రాతినిధ్యం
నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి : సీపీఐ(ఎం)


​​నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ బోర్డు (వైటీడీ)పై రాజకీయంగా దుమారం రేగుతోంది.. బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఏ ఒక్కరికీ చోటు దక్కలేదు. యాదాద్రి ఆలయం భౌగోళికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ, కొత్తగా నియమించిన బోర్డులో స్థానిక ప్రజాప్రతినిధులు లేదా జిల్లా నాయకులకు, ఇతరులకు కనీస ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై అధికార పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ​​తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక టెంపుల్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ కింద 18 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం లభించింది. అయితే ఈ బోర్డు కూర్పు ప్రస్తుతం తీవ్ర రాజకీయ వివాదాలకు వేదికైంది.

​​​సీఎం సొంత జిల్లాకు పెద్దపీట!
​వైటీడీ బోర్డు నియామకాల్లో ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ బోర్డుకు చైర్మెన్‌‌గా నియమితులైన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంఎస్ఎన్ గ్రూప్ అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నవాబ్‌పేట మండలం గురుకుంట గ్రామానికి చెందినవారు. గతంలో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచిన ఎం. శ్రీనివాస్ రెడ్డికి ఈయన స్వయాన సోదరుడు. ఆలయం ఉన్న జిల్లాను పక్కనబెట్టి, సీఎం తన సొంత జిల్లా నేతలకు, తనకు అత్యంత సన్నిహితులకు పదవులు ఎలా కట్టబెడతారని అధికార పార్టీ నేతలే అంటున్నారు.

​​​పెట్టుబడిదారుల కబంధ హస్తాలలో వైటీడీ?
​సాధారణంగా ఆలయాల పాలక మండలిలో స్థానిక భక్తులకు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, ప్రజా సేవకులకు చోటు కల్పిస్తారు. కానీ, వైటీడీ బోర్డు కూర్పులో కార్పొరేట్ శక్తులు, ఫార్మా దిగ్గజాలు, మీడియా అధిపతులు, సినీ గ్లామర్‌తో నిండిపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎన్ ఫార్మా సంస్థ అధినేతకు చైర్మెన్ పదవి ఇవ్వడం, మెట్రో ఇండియా ఎండీ వంటి మీడియా ప్రముఖులకు అవకాశం కల్పించారు. యాదాద్రి లాంటి పవిత్ర క్షేత్రాన్ని పెట్టుబడిదారుల లాభార్జన కేంద్రంగా మార్చేందుకే ప్రభుత్వం ఈ విధమైన ‘కార్పొరేట్’ కూర్పు చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కార్పొరేట్ శక్తుల చేతికి దేవస్థానం బోర్డు
​ యాదగిరిగుట్ట దేవస్థానాన్ని భువనగిరి జిల్లా ప్రజలు తమ సొంత ఆలయంగా భావిస్తారు. ఆలయానికి సంబంధించిన సమస్యలు వచ్చిన ప్రతిసారీ స్థానికులే ముందుండి స్పందించారు. అలాంటి వారిని పక్కనబెట్టి జిల్లాతో సంబంధం లేని వారికి బాధ్యతలు అప్పగించడం సమంజసం కాదు. పెద్ద పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాలకు దేవస్థానం బోర్డును అప్పగించారు. భక్తి, సేవా తత్పరులు.. ఆలయ అభివృద్ధిని కాంక్షించేవారిని విస్మరించడం సమంజసం కాదు. జిల్లాకు సంబంధించి ఐదుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇన్‌చార్జి మంత్రులు ఉన్నా ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదు? ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించి స్థానికులకు తగిన ప్రాధాన్యం కల్పించాలి.
ఎండి జహంగీర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
​​​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -