Thursday, July 2, 2026
E-PAPER
Homeక్రైమ్రూ. కోట్లల్లో దాగా.. డెకాయిట్ ముఠా గుట్టురట్టు

రూ. కోట్లల్లో దాగా.. డెకాయిట్ ముఠా గుట్టురట్టు

- Advertisement -

– ఈ దగాలో ఇద్దరి అసలు పోలీసుల భాగస్వామ్యం 
– అసలు- నకిలీ పోలీసుల గుట్టురట్టు
– 12 మంది గ్యాంబ్లర్లు అరెస్ట్ 
– రూ. 17.60 లక్షల అసలు నగదుతో పాటు
నకిలీ కరెన్సీ కట్టలతో పాటు  2 ఇన్నోవా కార్లు, 1 ఎర్టిగ, 1 స్కూటీ, 16 సెల్ ఫోన్లు 
– అంతర్రాష్ట్ర డెకాయిటీ ముఠా గుట్టును రట్టు చేసిన సత్తుపల్లి పోలీసులు
నవతెలంగాణ-సత్తుపల్లి 

అమాయకులను ఆకట్టుకునే మాటలతో బురిడీ కొట్టించి, ‘ఒకటికి నాలుగు రెట్లు’ డబ్బులు ఇస్తామంటూ ఆశ చూపించి రూ. కోట్ల రూపాయల దగాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర డెకాయిటీ ముఠా గుట్టును సత్తుపల్లి పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ వసుంధర యాదవ్ ఫారెబి స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం ఇన్‌స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరితో కలిసి డెకాయిటీ ముఠా మోసాలకు సంబంధించిన వివరాలు, వారి దగాను వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన కుర్రా గంగాధరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి చాలా పకడ్బందీగా డెకాయిటీ ముఠా గుట్టును చేదించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ భారీ మోసం కేసుకు సంబంధించి ఏ-1 నుంచి ఏ-12 వరకు మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. 

​మోసపూరిత నెట్‌వర్క్.. పోలీసుల వేషంలో దోపిడీలు!
ఈ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారి నకిలీ పేర్లతో అమాయకులకు ఫోన్లు చేసి తన వద్ద రూ. 2 కోట్ల బ్లాక్ మనీ ఉందని, దానిని వైట్ మనీగా మార్చడానికి సహకరిస్తే రూ. 10 లక్షలకు బదులుగా రూ. 40 లక్షలు ఇస్తామని ఆశ చూపించేవాడని ఏసీపీ వసుంధర యాదవ్ ఫారెబి తెలిపారు. బాధితులు ఆ మాటలు నమ్మి డబ్బుతో సత్తుపల్లి మండలం గంగారం పరిసర ప్రాంతాలకు రాగానే, ప్లాన్ ప్రకారం ముఠా సభ్యులు డమ్మీ చిల్డ్రన్ కరెన్సీ బ్యాగులతో అక్కడకు చేరుకునేవారన్నారు. బాధితులు తెచ్చిన అసలు డబ్బును లెక్కబెడుతున్న క్రమంలో ముందే పథకం వేసుకున్న నకిలీ నోట్ల కట్టలతో పాటు కొందరు అసలు పోలీసులు కార్లలో వచ్చి దాడి చేసేవారని ఆమె వివరించారు. బాధితులను దొంగనోట్ల వ్యాపారులు అని బెదిరించి, కళ్లెదుటే తమ వాళ్లను కూడా కొడుతూ నాటకమాడి, నమ్మకంగా డబ్బులు లాక్కొని పారిపోయే వారని తమ విచారణలో తేలిందని ఆమె చెప్పారు.

​ముఠాలో ఇద్దరు అసలు ఖాకీలు.. తప్పించుకు తిరుగుతున్న సీమ్ ప్రొవైడర్లు!
ఈ ఘరానా దగాలో నిజమైన పోలీసులు ఏ-2  ముళ్లగిరి వర్ధన్ (15వ బెటాలియన్ కానిస్టేబుల్), ఏ-4, బేరా కేశవరావు (ఆర్ఎస్సై,15వ బెటాలియన్) భాగస్వాములు కావడం గమనార్హం. వీరితో పాటు వివిధ జిల్లాలకు చెందిన పెయింటర్లు, క్యాబ్ డ్రైవర్లు, ప్రైవేట్ ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారని ఆమె వివరించారు. బుధవారం  గంగారంలోని నేర స్థలంలో స్పెషల్ టీమ్స్ జరిపిన మెరుపు దాడిలో ఏ-1 నుంచి ఏ-12 వరకు నిందితులు దొరికిపోగా, వీరికి సహకరించిన ఏ-13 (రామాంజనేయులు), ఏ-14 (రాజు – సీమ్ ప్రొవైడర్) లు ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు. 

పోలీసులకు పట్టుబడిన డెకాయిట్ ముఠా 
పోలీసులు జరిపిన మెరుపు దాడిలో డెకాయిట్ బ్యాచ్ కి సంబంధించి 12 మందిని పోలీసుల అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఈద చంటిబాబు, కలిదిండి మండలం, వెంకటాపురం, ముళ్ళగిరి వర్ధన్, సత్తుపల్లి మండలం, తుంబూరు మువ్వా సత్యనారాయణ, టి. నర్సాపురం,  బేరా. కేశవరావు, సత్తుపల్లి మండలం, బేతుపల్లి గంగారం, మారుముడి మధు, చింతలపూడి మండలం, మల్లాయిగూడెం, గోరంట్ల గౌతమ్ కుమార్, వేంసూరు మండలం బీరాపల్లి, కర్లపూడి నవీన్, నేలకొండపల్లి మండలం సదాశివపురం, నక్కా నాగరాజు, సత్తుపల్లి మండలం తుంబూరు, సాగి సుబ్బరాజు, అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొడగట్టుపల్లి, కాపా శ్రీనివాస్, ఏఎస్ రావు నగర్, సికింద్రాబాద్, దుడుగురు కురబ గణే‌ష్ శ్రీకృష్ణ నగర్ కర్నూలు జిల్లా, ఉపేంద్రం జనార్ధన రాజు,  రాజేంద్ర నగర్, ధర్మవరం శ్రీ సత్య సాయి జిల్లా, రామాంజనేయులు, సిమ్ ప్రొవైడరులు ఉన్నారు.

​భారీగా రికవరీ.. రూ. 17.60 లక్షల నగదుతో పాటు నకిలీ నోట్ల కట్టలు స్వాధీనం 
డెకాయిటీ బ్యాచ్ ​నిందితుల నుంచి పోలీసులు భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 17,60 లక్షల నగదుతో పాటు 2 ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కార్, ఒక టీవీఎస్ యాక్సెస్ స్కూటీ ఉన్నాయి. వీటితో పాటు నేరానికి వాడిన 16 సెల్‌ఫోన్లు, 2 పోలీస్ యూనిఫాంలు, ఒక హ్యాండ్‌కఫ్ (సంకెళ్లు), ఒక ఎస్ఐ యూనిఫామ్ సెట్, ఒక ఆర్ఎస్ఐ యూనిఫామ్ సెట్, రెండు పోలీస్ వైట్ టీ షర్టులు, రెండు పోలీస్ రెయిన్ కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాధితులను బురిడీ కొట్టించడానికి సిద్ధం చేసిన రూ. 500 ముద్రణ గల డమ్మీ చిల్డ్రన్ కరెన్సీ నోట్లు (మొత్తం 80 బండిళ్లు) ఒక్కో బండిల్‌లో 100 నోట్లు) కూడా లభ్యమయ్యాయి. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన ఎస్ఐలు, పోలీస్ సిబ్బందిని ఏసీపీ వసుంధర యాదవ్ ఫారెబి, సీఐ తుమ్మలపల్లి శ్రీహరి అభినందిస్తూ నగదు రివార్డులు అందజేశారు. ఈ డెకాయిట్ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టుకునేందుకు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు వీర ప్రసాద్, ప్రదీప్ కుమార్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -