పియ్రమైన వేణు గీతికకు
నాన్న ఎలా ఉన్నావు? చలి తగ్గింది, నెమ్మదిగా ఎండలు మొదలవుతు న్నాయన్నావు. ఇక్కడ కూడా అలాగే ఉంది వాతావరణం. ఎండ వేడి తెలుస్తోంది. నాన్న కిందటి ఉత్తరాల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి, ప్రేమ పెళ్లి గురించి చెప్పాను. ఈ మధ్య పేపర్లో చదివాను, ఇది కూడా నీకు తప్పకుండా చెప్పాలనిపించింది.
పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళల్లో ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే.. అమ్మాయి అబ్బాయి స్నేహితులు, పార్టీలు, సినిమాలు అంటూ తిరగడమే కాకుండా, ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా అంటూ ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లి గడిపి వస్తున్నారు.
ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడైతే తిరిగారో, లేక ఎక్కడైతే ఇద్దరూ కలిసి ఉన్నారో అవన్నీ రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కనుక పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లి అయిన సరే ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లొద్దు. ఒకవేళ షాపింగ్, సినిమా మొదలైన చోట్లకు వెళ్ళవలసి వస్తే తప్పని సరిగా ఇంట్లో వాళ్ళను తోడు తీసుకుని వెళ్ళాలి. ఏదైనా జరిగిన తర్వాత బాధపడేకంటే ముందుగా జాగ్రత్త పడటం మంచిది. ఎప్పుడైనా సరే ‘మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా, నా మీద నమ్మకం లేదా, నేను అందరిలాంటి వాడిని కాదు’ లాంటి కబుర్లు ఎన్నో ఎన్నెన్నో చెప్తారు. వాటిని నమ్మకూడదు.
ఏ విషయం అయిన సరే ఇంట్లో వాళ్లకు చెప్పాలి. అందరూ అలా ఉంటారని, ఉన్నారని నేను చెప్పడం లేదు నాన్న. ప్రస్తుత పరిస్థితి ఎవరినీ నమ్మేటట్టు లేదు. కనుక మనం ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. అందులోనూ పెద్దవాళ్ళు చూసిన సంబంధం కదా అంతా బాగానే ఉంటుంది అని అనుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి అని ఒక సూచన చేస్తున్నా అంతే. ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఎప్పుడూ నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావని ఆకాంక్షిస్తూ…
ప్రేమతో మీ అమ్మ
– పాలపర్తి సంధ్యారాణి



