నవతెలంగాణ – రాయపోల్
గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎపీవో జనార్దన్ అన్నారు. గురువారం రాయపోల్ మండలం ఆరేపల్లి గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక చెత్త వర్గీకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లోనే చెత్తను నాలుగు రకాలుగా వేర్వేరుగా సేకరించి గ్రామ పంచాయతీకి అందించాలని సూచించారు. వంటగది నుంచి వచ్చే ఆహార అవశేషాలు, కూరగాయలు, పండ్ల తొక్కలు, ఆకులు వంటి తడి చెత్తను ప్రత్యేకంగా ఉంచితే కంపోస్టు ఎరువుగా తయారు చేయవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులు, కాగితాలు, అట్ట పెట్టెలు, గాజు సీసాలు, లోహ వస్తువులు వంటి పొడి చెత్తను వేరు చేసి అందిస్తే వాటిని రీసైక్లింగ్‌కు పంపించే అవకాశం ఉంటుందన్నారు.వాడిన డైపర్లు, శానిటరీ న్యాప్‌కిన్లు, బ్యాండేజీలు, మెడికల్ వ్యర్థాలు వంటి శానిటరీ చెత్తను ప్రత్యేకంగా కట్టిప్యాక్ చేసి పంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు.
అలాగే పాడైన బల్బులు, ట్యూబ్‌లైట్లు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గడువు ముగిసిన మందులు వంటి ప్రత్యేక చెత్తను సాధారణ చెత్తలో కలపకుండా ప్రత్యేకంగా అప్పగించాలని తెలిపారు.చెత్తను వర్గీకరించడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపడుతుందని, దోమలు, ఈగలు, దుర్వాసన తగ్గి అంటువ్యాధుల నివారణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం చెత్త వర్గీకరణను తప్పనిసరిగా పాటించి స్వచ్ఛ గ్రామ నిర్మాణానికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దివ్య కృష్ణ, ఉపసర్పంచ్ వీరేశ్,వార్డు సభ్యులు కనుకయ్య, నర్సింలు, కల్యాణి, కొమురయ్య, మమత, మంజుల,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



