Thursday, July 2, 2026
E-PAPER
Homeఖమ్మంరైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలి

రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ 
నవతెలంగాణ-సత్తుపల్లి

రైతుల అవసరం మేరకు విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం తగినంతగా అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) కార్యాలయంలో గురువారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో శ్రీనివాస్ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమవుతున్న తరుణంలో వ్యవసాయ శాఖ కార్యాలయాలు, సహకార సంఘాల వద్ద రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

​అమాయక రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత యాసంగి సీజన్‌లో ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన వరి ధాన్యానికి సంబంధించిన బిల్లులు ఇప్పటికీ పెండింగులో ఉండటం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.  పెండింగ్ డబ్బులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. 

కాకర్లపల్లికి చెందిన పేదలు ఇళ్ల స్థలాల కోసం ఏడాది కాలంగా తహసీల్దార్, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పాత కాలువ స్థలాన్ని చదును చేసి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

​2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డీఎంఎఫ్టీ నిధులతో లైబ్రరీ, రీడింగ్ రూములతో పాటు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఒక్కో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ. 25 లక్షల వ్యయంతో పనులు ప్రారంభించారని, అయితే గుత్తేదారులు ఆయా  నిర్మాణాలను పూర్తి చేయకుండా మధ్యలోనే నిలిపివేశారన్నారు. ప్రభుత్వం వెంటనే వీటికి నిధులు కేటాయించి పనులను పునఃప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, మండల కమిటీ సభ్యులు అయినంపూడి సనందనరావు, కువ్వారపు లక్ష్మణరావు, ఎలగం కృష్ణయ్య, బండి వేలాద్రి, హసావత్ కృష్ణ, ఎలగం రాములు, తడికమళ్ల రామకృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -