Friday, July 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంముగిసిన చర్చలు… కానరాని పురోగతి

ముగిసిన చర్చలు… కానరాని పురోగతి

- Advertisement -

హార్ముజ్, ఇరాన్ ఆస్తులవిడుదల పైనే దృష్టి
ఖమేనీ అంత్యక్రియల తర్వాత తదుపరి విడత సంప్రదింపులు

దోహా : ఖతార్ రాజధాని దోహాలో ఇరాన్, అమెరికా అధికారుల మధ్య జరిగిన పరోక్ష చర్చలు ముగిశాయి. మధ్యప్రాచ్యంలో చిరకాల శాంతిని నెలకొల్పేందుకు ఉద్దేశించిన ఈ చర్చలలో ఎలాంటి పురోగతి కన్పించలేదు. రెండు వారాల క్రితం ఎంఓయూను ప్రకటించినప్పుడు పరిష్కారం కుదిరిందని చెప్పుకున్న అంశాల పైనే చర్చలు కొనసాగాయి. ఇరు దేశాల ప్రతినిధులు రెండు రోజుల పాటు దోహాలో గడిపారని, హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రవాణా పైన, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల పైన చర్చించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చర్చలను కొనసాగించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. అమెరికా-ఇజ్రాయిల్ దాడులలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించిన ఊరేగింపుల తర్వాత ఈ నెల 9న ఆయన భౌతికకాయాన్ని ఖననం చేస్తారు. ఈ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం తదుపరి సమావేశం జరుగుతుందని ఖతార్ విదేశాంగ శాఖ తెలిపింది. ఎంఓయూలో పొందుపరచిన అంశాలపై దోహా చర్చలు ‘సానుకూల పురోగతి’ సాధించాయని, స్విట్జర్లాండ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశపు ఫలితాల ఆధారంగా ఇవి సాగాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో వివరించారు. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తులతో వేర్వేరుగా సమావేశమయ్యారని ఆయన తెలియజేశారు.

పురోగతి కన్పిస్తోంది : అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన పరిమితులపై ఇరు పక్షాలు పురోగతి సాధిస్తున్నాయని చెప్పారు. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభం కావడానికి ఇరాన్ అణు కార్యక్రమమే కారణమన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌లో అణ్వాస్త్రాలు లేకుండా చేసే పని బాగా కొనసాగుతోందని ట్రంప్ తెలిపారు. ‘ఇరు పక్షాల మధ్య మంచి సమావేశాలు జరుగుతున్నాయి. చూద్దాం’ అని అన్నారు. ఇరాన్‌పై మరోసారి పూర్తి స్థాయి యుద్ధానికి దిగాలని భావించిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గారని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత చమురు ధరలు నాలుగు నెలల కనిష్ట స్థాయికి చేరాయి. కాగా దోహా చర్చలలో ఇరాన్ అణు కార్యక్రమం ప్రస్తావనే రాలేదని తెలుస్తోంది. దీనిపై తర్వాతి దశలో చర్చిస్తామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. ‘మేము ఇరాన్ అణు కార్యక్రమం గురించి ఎలాంటి సందేహం లేకుండా ఆందోళన చెందుతున్నాం. దాని గురించి తర్వాత చర్చిస్తాం. ప్రస్తుతానికి దోహా చర్చలు బాగానే జరిగాయి’ అని ఆయన అన్నారు. చర్చలు ముగిశాయని ఇరాన్ ప్రతినిధి బృందం నాయకుడు, విదేశాంగ శాఖ సహాయ మంత్రి కజమ్ ఘరీబబాడీ తెలిపారు. ఇరు పక్షాలు తమ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకున్నాయా అని విలేకరులు ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వలేదు.

హార్ముజ్‌పై పట్టు వీడని ఇరాన్
ఎంఓయూ ప్రకారం హార్ముజ్ జలసంధి మీదుగా వాణిజ్య నౌకల రాకపోకలను ఇరాన్, అమెరికా అనుమతించాల్సి ఉంటుంది. ఈ జలసంధిలో నౌకాయానం పాక్షికంగా పున్ణప్రారంభం అయినప్పటికీ పరిస్థితి మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఓ సరుకు రవాణా నౌకపై గత వారంలో ఇరాన్ దాడి చేయడంతో మధ్యప్రాచ్యంలో తిరిగి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బలప్రయోగం ద్వారా అయినా సరే జలసంధిపై తన నియంత్రణకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకోవాలని టెహ్రాన్ నిర్ణయించుకున్నదని ఇరాన్ సీనియర్ అధికారులు చెప్పారు. అరవై రోజుల ఎంఓయూ గడువు ముగిసిన తర్వాత…అంటే ఆగస్ట్ మధ్య నుంచి హార్ముజ్‌లో నౌకాయానంపై సుంకాలు విధిస్తామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇదిలావుండగా హార్ముజ్‌లో నౌకల రవాణా నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 35 వాణిజ్య నౌకలు హార్ముజ్ మీదుగా రాకపోకలు సాగించాయి. 11 కార్గో నౌకలు, 9 ట్యాంకర్లు…మొత్తం 20 నౌకలు పర్షియన్ గల్ఫ్‌లో ప్రవేశించగా 15 నౌకలు నిష్క్రమించాయి.వీటిలో తొమ్మిది ట్యాంకర్లు, ఆరు కార్గో నౌకలు ఉన్నాయి. యుద్ధానికి ముందు రోజుకు సగటున సుమారు 110 నౌకలు హార్ముజ్ మీదుగా ప్రయాణించేవి.

శక్తివంతంగా స్పందిస్తాం : 
ఇజ్రాయిల్‌కు అరాగ్చీ హెచ్చరిక
ఇజ్రాయిల్ దాడులు చేస్తే తక్షణమే శక్తివంతమైన ప్రతి దాడులతో స్పందిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. అమెరికా తన మిత్రదేశాన్ని అదుపులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీని హతమారుస్తామంటూ ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కట్జ్ చేసిన ప్రకటనపై అరాగ్చీ తీవ్రంగా స్పందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -