– అదీను పాత పద్ధతిలోనే సరఫరా చేయాలి
– సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు
నవతెలంగాణ-సత్తుపల్లి : రైతుల అవసరం మేరకు యూరియాను ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్తుపల్లిలోని రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) భవనంలో శుక్రవారం పాండురంగారావు ప్రజా సంఘాల నాయకులతో కలిసి విలేకరులతో యూరియా కొరత ప్రభుత్వ విధానం అంశాలపై మాట్లాడారు. కొత్తగా ప్రవేశపెట్టిన ‘రైతు ఫర్టిలైజర్ యాప్’ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యాప్‌లో వస్తున్న సాంకేతిక లోపాలు, నెట్‌వర్క్ అంతరాయాల కారణంగా రైతులు గంటల తరబడి ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోందని పాండురంగారావు మండిపడ్డారు.
ప్రస్తుత సాగు సీజన్‌లో వ్యవసాయ పనులు కీలక దశకు చేరుకున్నాయని, ఈ సమయంలో యూరియా కొరత ఏర్పడితే రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. సాంకేతిక ఇబ్బందులతో కూడిన యాప్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకుని, పాత పద్ధతిలోనే యూరియా పంపిణీని కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
మార్కెట్లో రైతులకు అవసరమైన మేర ఎరువుల నిల్వలను అందుబాటులో ఉంచి, కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు మాట్లాడుతూ… రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలన్నారు.
ఒకవేళ రైతుల ప్రయోజనాలను విస్మరిస్తే రైతు సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రాజబాబు హెచ్చరించారు.ఈ సమావేశంలో సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, పార్టీ నాయకులు మోరంపూడి వెంకట్రావు, చావా రమేష్, చప్పిడి భాస్కర్ పాల్గొన్నారు.



