Friday, July 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేసీఆర్ దూరదృష్టి నేడు రైతులకు ఫలితాల రూపంలో కనిపిస్తోంది

కేసీఆర్ దూరదృష్టి నేడు రైతులకు ఫలితాల రూపంలో కనిపిస్తోంది

- Advertisement -

– జుక్కల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ హన్మంత్ షిండే
నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ కేంద్రంతోపాటు పలు మండలాలకు చెందిన రైతులు సాగు చేసిన ఆయిల్ పామ్ తాజా పండ్ల గెలలను (FFB) కందర్పల్లి ఆయిల్ పామ్ సేకరణ కేంద్రానికి తీసుకువచ్చి డంప్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే  హన్మంత్ షిండే   కందర్పల్లి ఆయిల్ పామ్ సేకరణ కేంద్రాన్ని సందర్శించి, పంట దిగుబడి, నాణ్యత, రైతులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అనంతరం రైతులతో, సంస్థ ప్రతినిధులతో ఆత్మీయంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

_ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే  హన్మంత్ షిండే  మాట్లాడుతూ, “గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కేసీఆర్  ఆయిల్ పామ్ సాగు విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు, రైతులకు అందించిన ప్రోత్సాహక చర్యల ఫలితాలు నేడు రైతాంగానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయిల్ పామ్ రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పంటగా నిలుస్తోంది” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హిందుస్తాన్ యూనిలీవర్ సంస్థ సీనియర్ మేనేజర్ శ్రీ సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ, ఆయిల్ పామ్ రైతులకు మంచి దిగుబడితో పాటు గిట్టుబాటు ధర లభిస్తోందని, ఈ పంట రైతుల ఆదాయాన్ని పెంచే లాభదాయకమైన పంటగా నిలుస్తోందని తెలిపారు.

అనంతరం హిందుస్తాన్ యూనిలీవర్ ఏరియా మేనేజర్ శ్రీ జాదవ్ మోహన్ గారు మాట్లాడుతూ, 2021 సంవత్సరం నుంచి జుక్కల్ నియోజకవర్గ రైతుల సహకారంతో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు.

రైతులకు ప్రోత్సాహంగా డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ఎకరానికి రూ.5,000 చొప్పున హిందుస్తాన్ యూనిలీవర్ సంస్థ నేరుగా డ్రిప్ కంపెనీలకు చెల్లిస్తోందని పేర్కొన్నారు. రైతుల తరఫున డ్రిప్ ఇరిగేషన్ కోసం ఈ విధంగా నేరుగా చెల్లింపులు చేస్తున్న దేశంలోనే తొలి సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్ అని వివరించారు.

ఆయిల్ పామ్ పంటకు మార్కెట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఒక్కసారి మొక్కలు నాటితే సుమారు 30 సంవత్సరాల పాటు నిరంతర ఆదాయం పొందవచ్చని తెలిపారు. పందులు, కోతులు, వడగండ్ల వానల వంటి సమస్యల ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని, ఇతర పంటలతో పోలిస్తే కూలీల అవసరం కూడా తక్కువగా ఉంటుందని చెప్పారు. తక్కువ పెట్టుబడితో సంవత్సరానికి సుమారు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం అందించే లాభదాయకమైన పంట ఆయిల్ పామ్ అని పేర్కొన్నారు.

అలాగే రైతులు కోసిన గెలలను ప్రతి 15 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రాల ద్వారా కంపెనీనే నేరుగా కొనుగోలు చేస్తుందని, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే రైతులకు చెల్లింపులు జరుగుతాయని వివరించారు._

ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్లు  సాయిప్రసాద్,  హమీద్,  వికాస్,  రాజు తదితరులు పాల్గొని రైతులకు ఆయిల్ పామ్ సాగు, నిర్వహణ, దిగుబడి, మార్కెటింగ్ అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే జుక్కల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ఆయిల్ పామ్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తదనంతరం కందర్పల్లి ఆయిల్ పామ్ సేకరణ కేంద్రం మేనేజ్‌మెంట్ తరఫున మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ను శాలువాతో ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -