Thursday, August 13, 2026
E-PAPER
Homeఖమ్మంసమస్యలు పరిష్కరించకుంటే తాడోపేడో తేల్చుకుందాం

సమస్యలు పరిష్కరించకుంటే తాడోపేడో తేల్చుకుందాం

- Advertisement -

– ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు
– ​తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన
నవతెలంగాణ – సత్తుపల్లి

అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేసి తాడోపేడో తేల్చుకుందామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) నాయకులు తేల్చి చెప్పారు. గురువారం ఆ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డుల ప్రదర్శనతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయాల్సిందిగా స్థానిక తాసిల్దార్ పున్నం సత్యనారాయణకు అందించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ..దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాలుగు దశల పోరాట కార్యక్రమానికి పిలుపునిచ్చిందని, అందులో భాగంగా మొదటి దశలో ఈ నెల 7వ తేదీన అన్ని పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరిగిందన్నారు. రెండవ దశ పోరాట కార్యక్రమంలో భాగంగా మండల తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రికి మెమోరాండం సమర్పించడం జరిగిందన్నారు. పీఆర్‌సీ గడువు ముగిసి మూడు సంవత్సరాలైనా అమలు చేయడం లేదని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల, పెన్షనర్ల కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టారన్నారు.

​కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయడం లేదని, హెల్త్ కార్డులు సక్రమంగా అమలు చేయకపోవడం విచారకరమన్నారు. అశాస్త్రీయంగా ఉన్న 25 నెంబర్ జీవోను సవరించాలని, పర్యవేక్షణ పోస్టులు భర్తీ చేయాలని, కేజీబీవీ, మోడల్, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని అనేకమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పండిట్, పీఈటీ పోస్టులకు ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితిలో లేరని తెలిపారు.

​ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, లేనియెడల ఈ నెల 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29వ తేదీన హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. అప్పటికి సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి దొడ్డా ఉమామహేశ్వరరెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి చెరుకు శ్రీనివాసరావు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు కొక్కెరగడ్డ వెంకటేశ్వరరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూరయ్య, అశోక చక్రవర్తి, కార్యదర్శులు మధు, ఐ. నాగేశ్వరరావు, నరసింహారావు, సాంబశివరావు, సూర్యనారాయణ, నాగమణి, అనసూయ, శాంతకుమారి, భాగ్యలక్ష్మి, టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి కొత్తా శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బెజవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -