Friday, July 3, 2026
E-PAPER
Homeజాతీయంతమిళనాడు గవర్నర్‌ చర్య ఆమోదయోగ్యం కాదు: సీపీఐ(ఎం)

తమిళనాడు గవర్నర్‌ చర్య ఆమోదయోగ్యం కాదు: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాధ్‌ అర్లేకర్‌ చర్య ఆమోదయోగ్యం కాదని సీపీఐ(ఎం) మండిపడింది. గవర్నర్‌ మదురైలో అధికారులతో సమీక్ష‍ా సమావేశం నిర్వహించడంపై సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శి పి.షణ్ముగం తీవ్రంగా స్పందించారు. కృష్ణగిరి కలెక్టరేట్‌ సమీపంలో టోల్‌ ప్లాజాను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన శుక్రవారం కృష్ణగిరి జిల్లాలో ఆందోళన చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మదురైలో అధికారులతో గవర్నర్‌ సమీక్ష‍ా సమావేశం నిర్వహించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. గతంలో తమిళనాడు మాజీ గవర్నర్ ఆర్.ఎన్. రవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన విషయం అందరికీ తెలుసునని అన్నారు. ఆయన వైఖరికి వ్యతిరేకంగా గతంలో డిఎంకె ప్రభుత్వం, సీపీఐ(ఎం), ఇతర పార్టీలు నిరసనలు చేపట్టినట్లు గుర్తు చేశారు. గవర్నర్‌ ముందుగా ముఖ్యమంత్రితో చర్చించాలని, ఆ సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు.

అందుకు విరుద్ధంగా గవర్నర్‌ ఏకపక్ష‍ంగా వ్యవహరించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. కృష్ణగిరిలో చేపట్టిన నిరసన గురించి మాట్లాడుతూ, కృష్ణగిరి కలెక్టరేట్ సమీపంలోని టోల్ గేట్ విషయంలో ‘భారత జాతీయ రహదారుల అధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ)’ నిబంధనలను పాటించాలని షణ్ముగం అన్నారు. ఎన్‌హెచ్‌ఎఐ నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి 10 కిలోమీటర్ల దూరంలో టోల్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఈ టోల్ గేట్‌ను మాత్రం కేవలం 3 కిలోమీటర్ల పరిధిలోనే ఏర్పాటు చేశారని అన్నారు. అలాగే, 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానికుల నుండి టోల్ రుసుము వసూలు చేయకూడదని, కానీ ఈ టోల్ గేట్ సమీపంలో నివసించే ప్రజల నుండి రుసుము వసూలు చేస్తున్నారని అన్నారు. రైతులు సహా ప్రజలంతా ఈ టోల్ గేట్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం మదురైలో పర్యటించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అక్కడ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైగై నదిని పునరుద్ధరించకపోతే ‘లోక్ భవన్’ (రాజ్‌భవన్) జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష‍ాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గవర్నర్ చర్యలు రాజ్యాంగ పరిధిని అతిక్రమించడం, సమాంతర పాలన, రాష్ట్ర స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమేనని మండిపడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -