– రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-ఆలేరు టౌను : ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని , రాష్ట్ర ప్రభుత్వ విపు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు.
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ,ఉద్యోగుల కార్మికుల వేతనాలు సకాలంలో అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. ఆలేరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులగా పనిచేస్తున్న సమస్యలు తనకు తెలుసు అన్నారు. సమస్యల పరిష్కారం కొరకు వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో కృషి చేస్తామన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ స్వప్న రాథోడ్ తో పేరుకుపోయిన సమస్యల గురించి చర్చించారు. గత కొన్ని నెలల నుండి వైద్య ,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు 104, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, ఉద్యోగ కార్మికులకి ఒకరికి లక్ష మేర బకాయలు ఉన్నాయని సకాలంలో వారికి వేతనాలు అందేలా చూస్తామన్నారు. డయాలసిస్ సెంటర్లో ప్రస్తుతం ఉన్న పడకలకు గాను , మరో 10 పడకలు పెంచి మరింత డయాలసిస్ సేవల అందేలా కృషి చేస్తామన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో ముపై పడకల నుండి 50 పడకల ఆసుపత్రిగా మార్చుతామని సభాముఖంగా తెలియజేశారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి నెల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ స్వప్న రాథోడ్, మున్సిపల్ చైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్, ఎమ్మార్వో వి ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి, గంధ మల్ల అశోకు , నీలం పద్మ ,ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



